వైద్యశాఖకు ఒమిక్రాన్ గుబులు.. సెకండ్ డోస్‌ టార్గెట్ డిసెంబర్ 31

by Anukaran |   ( Updated:2021-12-03 22:19:37.0  )
వైద్యశాఖకు ఒమిక్రాన్ గుబులు.. సెకండ్ డోస్‌ టార్గెట్ డిసెంబర్ 31
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సగానికిపైగా జనం ఇంకా సెకండ్ డోస్‌ వేయించుకోవాల్సి ఉన్నది. అర్హులైన 2.77 కోట్ల మందిలో 1.32 కోట్ల మందే ఇప్పటివరకు సెకండ్ డోస్ తీసుకున్నారు. దాదాపు 23 జిల్లాల్లో 47% కంటే తక్కువ మాత్రమే నమోదైంది. తక్షణం 25 లక్షల మందికి సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉన్నది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఎంతగా కృషి చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఈ నెల చివరికల్లా మొత్తం టార్గెట్ సాధించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అందువల్లనే ఇప్పుడు ఒమిక్రాన్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.

సరిహద్దు జిల్లాల్లో టీకాల పంపిణీ మరీ తక్కువగా ఉన్నది. నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, గద్వాల, నారాయణపేట, వికారాబాద్ తదితర సరిహద్దు జిల్లాల్లో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ టైమ్‌లో వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్నది. ఇప్పుడు అక్కడ వ్యాక్సినేషన్ కూడా తక్కువగా ఉండడంతో ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన పడుతున్నారు. అందుకే ఆగమేఘాల మీద ప్రధాన కార్యదర్శి ఈ జిల్లాల్లో పర్యటించి అక్కడి వైద్యాధికారులను అలర్టు చేశారు. వ్యాక్సిన్ పంపిణీని వేగవంతం చేయడానికి జిల్లాలవారీగా టార్గెట్ డేట్ ఫిక్స్ చేశారు.

ఇక ఫస్ట్ డోస్‌ను సకాలంలో వేయించుకోవాల్సినవారు కూడా దాదాపు 25 లక్షల మంది ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రం మొతం మీద 2.52 కోట్ల మందికి మాత్రమే ఫస్ట్ డోస్ అందింది. రాష్ట్రం దగ్గర ప్రస్తుతం 72.42 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నప్పటికీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది ముమ్మరంగా డ్రైవ్ నిర్వహిస్తున్నప్పటికీ టీకాల పంపిణీ సంతృప్తికరంగా సాగడం లేదని ఆ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. రెండు డోసులు పూర్తిగా తీసుకున్నవారికి కొత్త వేరియంట్‌తో పెద్దగా ముప్పేమీ లేదని, ఇంకా మానసికంగా సిద్ధంగా లేనివారు వెంటనే టీకాలను తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు.

ఇప్పటికీ ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లోనే ఎక్కువగా టీకాల పంపిణీ జరుగుతున్నది. రోజుకు సగటున రెండున్నర లక్షల డోసులకు పైగా ఇస్తున్నా ఇందులో 95% ప్రభుత్వ కేంద్రాల్లోనే నమోదవుతున్నది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున నాలుగు వేల డోసులు కూడా దాటడంలేదు. ఈ నెల చివరికల్లా లక్ష్యాన్ని చేరుకోవడంపైనే వైద్యారోగ్య శాఖ కసరత్తు చేస్తున్నది. ఒమిక్రాన్ వేరియంట్ భయంతోనైనా జనం ముందుకు వస్తారని భావిస్తున్నది.

Advertisement

Next Story