భయపెడుతున్న ‘స్క్రీమ్‌బులెన్స్’

by Anukaran |
Screambulance
X

దిశ, ఫీచర్స్ : అంబులెన్స్ అందరికీ తెలుసు. కానీ ‘స్క్రీమ్‌బులెన్స్’ ఎప్పుడైనా విన్నారా? లేదు కదా! అయితే ఈ ‘స్క్రీమ్‌బులెన్స్’ జపాన్‌లో ఒక కొత్త హాంటెడ్ హౌస్ అనుభవం. ఇది చాలా చిన్న ప్రదేశంలో అత్యంత భయానక అనుభవాన్ని అందించడానికి రూపొందించారు. అంతేకాదు సామాజిక దూర నియమాలకు కూడా కట్టుబడి ఉంటుంది.

కొవిడ్ -19 మహమ్మారి నిజంగా ఎన్నో వ్యాపారాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్‌‌ను కూడా దెబ్బతీసింది. హాంటెడ్ హౌస్ ఇందుకు మినహాయింపేం కాదు. దాంతో కంపెనీలు వ్యాపారాన్ని తిరిగి పొందడానికి, కస్టమర్లను ఆకర్షించేందుకు సృజనాత్మక ప్రత్యామ్నాయాలతో ముందుకు వస్తున్నాయి. అలాగే పాండమిక్ భయాలు ఇంకా తొలిగిపోనందున సామాజిక దూరపు ప్రోటోకాల్‌లను పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది ‘స్క్రీమ్‌బులెన్స్’. ఇది భయానక ఇంటిరీయర్ భాగంతో కూడిన బీట్‌డౌన్ అంబులెన్స్. దీంట్లో బూట్ చేయడానికి జాంబీ లాంటి సిబ్బంది ఉంటారు. ఈ స్క్రీమ్‌బులెన్స్ మొబైల్ హాంటెడ్ హౌస్‌లో ఓ వినూత్న అనుభవాన్ని అందివ్వడానికి ప్రయత్నిస్తోంది. జపనీస్ హాంటెడ్ హౌస్ కంపెనీ కోవగరాసెటై (స్కేరింగ్ కార్ప్స్) దీన్ని సృష్టించింది. ఆసియాలోనే మొట్టమొదటి మొబైల్ హర్రర్ ఎక్స్‌పీరియన్స్‌‌కు ‘ స్క్రీమ్‌బులెన్స్’ వేదికగా నిలిచింది.

Haunted House Scare

ఓమ్నీ వాహనాన్ని అంబులెన్స్‌లా తీర్చిదిద్ది, దానికి రక్తపు మరకలను తలపించేలా పెయింట్ చేస్తారు. దాంతో బయటవైపు చూడ్డానికి భయంకరంగా కనిపిస్తుంది. కానీ లోపలి భాగం ఔట్‌సైడ్ కన్నా ఘోరంగా ఉంటుంది. వైద్య పరికరాలు, నకిలీ రక్తపు సంచులతో ఎటూ చూసిన రక్తపు మరకలు. చెల్లాచెదురుగా రక్తంలో తడిసన పేషెంట్ల దుస్తులు చూస్తేనే వణికిపోయేలా ఆ సెటప్ ఉంటుంది. దానికి తోడు భయంతో కూడిన 3-D ఆడియో సౌండ్, రికార్డింగ్ మైక్రోఫోన్ దడపుట్టిస్తాయి.

ambulance horror

థ్రిల్ కోరుకునే వినియోగదారులు.. స్క్రీమ్‌బులెన్స్‌ ఎక్స్‌పీరియన్స్ పొందాలంటే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. టోక్యోలోని మొత్తం 23 వార్డుల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కోరుకున్న సమయంలో భయానకంగా కనిపించే ఈ అంబులెన్స్ ఇంటి వెలుపల మనం నిర్ణయించుకున్న సమయంలో పార్క్ చేస్తారు. 9,000 యెన్ ($ 83) వ్యయంతో, 15 నిమిషాల భయానక సెషన్ల కోసం ఆరుగురు వ్యక్తులకు ఈ సేవలు అందిస్తారు. కానీ ఈ హాంటెడ్ హౌజ్ అనుభవాన్ని ఆస్వాదించడానికి జూలై 1 వరకు వేచి ఉండాలి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి సెషన్ తర్వాత అంబులెన్స్ మొత్తాన్ని శానిటైజ్ చేయడంతో పాటు వెంటిలేషన్ చేస్తారు.


Next Story