- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఓట్లు కురిపించే పథకాలు ఆపేస్తారు: ఎలక్షన్ కమిషన్

ఓటర్లను ప్రభావితం చేసే పథకాలను నిలుపుదల చేయాల్సిందేనని ప్రభుత్వానికి చెప్పామని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. విజయవాడలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఇందుకోసం సీనియర్ అధికారులను నియమించామని, వారు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించారని తెలిపారు. వారు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ, ఎన్నికలను సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు.
ప్రభుత్వపధకాలను ఎన్నికల సమయంలో నిలుపుదల చేయాలని సూచించామని, అయితే ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించుకోవచ్చని వారు స్పష్టం చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర సంబంధించిన పత్రాలు జారీ చేయడంలో ఫాస్ట్ ట్రాక్ విధానంలో జారీ చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకంగా సర్టిఫికేట్లు జారీ చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
చిత్తూరు జిల్లా బోధ మండలంలో బీజేపీ అభ్యర్ది నామినేషన్ విషయంలో చోటుచేసుకున్న ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారని ఆయన వెల్లడించారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. పోలీస్ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలపై నమ్మకం ఉందని ఆయన చెప్పారు. డీజీపీతో మాట్లాడామన్న ఆయన ఎన్నికల నిర్వహణలో పూర్తి సహకారమందిస్తామని చెప్పారన్నారు. నామినేషన్‌లు వెయ్యకుండా అడ్డుకున్న సంఘటనలను తీవ్రంగా పరిగనిస్తామని చెప్పారు. పంచాయతీ రాజ్ శాఖ నిఘా యాప్‌ను స్వాగతిస్తున్నామన్న ఆయన, యాప్ సేవలను కూడా వినియోగించుకుంటామని చెప్పారు.
ప్రభుత్వ భవనాలకు ఉన్న రంగులు తొలగించాలని హైకోర్టు చెబుతూ, గడువు కూడా విధించిందని ఆయన గుర్తు చేశారు. అలాగే విగ్రహాలన్నింటికీ ముసుగులు తొడగమన్న ఆయన, ప్రజలే స్వచ్ఛందంగా విరాళాలతో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలకు ముసుగులు అవసరం లేదని ఆయన ప్రకటించారు. మాయావతి, కాన్షీరాం విగ్రహాల కేసులో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. ఎన్నికల నేపథ్యంలో చెదురుమదురు ఘటనలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్న ఆయన, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, ఈనెల 15న మొదటివిడత, 17న రెండో విడత పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. వాలంటీర్లకి కేటాయించిన వర్క్‌చార్ట్ ప్రకారం సేవలందించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అలాకాకుండా పార్టీ ప్రచారం చేస్తే వారిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
Tags: ap, local body elections, vijayawada, election commissioner, ramesh kumar