ఎస్‌బీఐ కార్డ్స్ లాభాలు డౌన్ 

by Harish |
ఎస్‌బీఐ కార్డ్స్ లాభాలు డౌన్ 
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) క్రెడిట్ కార్డుల విభాగం ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్(ఎస్‌బీఐ కార్డ్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) పెరిగిన నేపథ్యంలో నికర లాభం 46 శాతం క్షీణించి రూ.206 కోట్లకు చేరుకున్నాయని, గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ 381 కోట్ల లాభాలను ఆర్జించినట్టు పేర్కొంది.

సమీక్షించిన త్రైమాసికంలో ఎన్‌పీఏలు, ఒత్తిడితో కూడిన రుణాల కోసం గతేడాది కేటాయించిన రూ. 329 కోట్ల కంటే రెట్టింపుతో రూ. 862 కోట్లకు చేరుకున్నాయని, అంతేకాకుండా అదనంగా రూ. 268 కోట్ల కేటాయింపులు జరిగినట్టు ఎస్‌బీఐ కార్డ్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారి వల్ల ఆర్థిక అంతరాయం ఏర్పడటంతో కంపెనీ అనిశ్చితులను అధిగమించే ప్రయత్నాలు చేసినప్పటికీ స్థూల ఎన్‌పీఏలు జూన్‌లో నమోదైన 1.2 శాతం నుంచి 4.29 శాతానికి పెరిగాయని, గతేడాది నమోదైన 2.33 శాతానికి మించి పెరిగాయని తెలిపింది.

అలాగే, రెండో త్రైమాసికంలో మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 2,513 కోట్లకు చేరుకున్నాని, గతేడాది ఇదే కాలంలో మొత్తం ఆదాయం రూ. 2,376 కోట్లుగా నమోదైనట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎస్‌బీఐ కార్డ్ వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ. 1,275 కోట్లకు చేరుకుందని, ఇతర ఆదాయలు సెప్టెంబర్ త్రైమాసికానికి 24 శాతం పెరిగి రూ. 99 కోట్లకు చేరుకున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా, ఈ త్రైమాసికంలో మొత్తం నిర్వహణ వ్యయం 9.6 శాతం తగ్గి రూ. 1,226 కోట్ల నుంచి రూ. 1,109 కోట్లకు చేరుకుంది. ఖర్చులు 17.3 శాతం క్షీణించి రూ. 2,264 కోట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 4.29 శాతంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్ షేర్ ధర 4.63 శాతం క్షీణించి రూ. 853.35 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story

Most Viewed