టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే

by Anukaran |   ( Updated:2020-07-25 06:49:17.0  )
టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే
X

దిశ, న్యూస్‌బ్యూరో: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం మీడియా సమావేశంలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని మండిపడ్డారు. హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ.. సచివాలయంలో గుడి కూల్చుతుంటే ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్‌ను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను వెనక నుంచి బీజేపీ, ముందు నుంచి ఎంఐఎం పార్టీలు సపోర్టు చేస్తున్నాయని, కేవలం మతాల పేరిట రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రూ.500 కోట్లు ఖర్చు పెడితే ప్రజలు బతుకుతారన్నారు. కొత్త సచివాలయం నిర్మించి చరిత్రలో ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారని, ప్రజల ప్రాణాల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా సెక్రటేరియట్‌కు వచ్చి పరిపాలన చేయలేదని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానాలు ఉన్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. ఇప్పుడున్న ఉన్న సెక్రటేరియట్‌లో చేయని పరిపాలన కొత్త సెక్రటేరియట్‌లో ఏం చేస్తారో అర్థం కావడం లేదన్నారు. సచివాలయంలో గుడి కూల్చేస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరూ కూడా సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించే దైర్యం చేయలేరన్నారు. మసీద్ కూల్చేస్తుంటే హోంమంత్రి కూడా మౌనంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో మసీద్ కూల్చేస్తే అక్బరుద్దీన్, అసదుద్దీన్ రాజకీయం చేసే వారన్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్‌కు మద్దతు ఇస్తూ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు.

గతంలో మియపూర్ నుండి పఠాన్‌చెరు వరకు హైవే లైన్ వేస్తుంటే రోడ్డుకోసం మసీద్ గోడను సైతం కూల్చనివ్వలేదన్నారు. సచివాలయంలో మసీద్‌ను కూల్చితే సీఎం కేసీఆర్‌కు ఎందుకు మద్దతు ఇస్తూ మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసదుద్దీన్‌కు ప్రభుత్వంలో ఎవరు ఉంటే వారిని పొగడ్తలతో ముంచెత్తడం అలవాటేనన్నారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డితో ఇలాగే దోస్తీ చేశారన్నారు.

Advertisement

Next Story