ఆలోచనలో సంగారెడ్డి.. ఏమైందీ ?

by  |
ఆలోచనలో సంగారెడ్డి.. ఏమైందీ ?
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని పరిసర ప్రాంతాల వ్యవసాయ రైతులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడం పల్లి మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు రెండు దశాబ్దాల క్రితం ఊట బావులతో నీటి సౌకర్యాన్ని వినియోగించి వ్యవసాయాన్ని కొనసాగించారు.

అయితే 2000 సంవత్సరం ప్రారంభ దశ నుంచి ప్రతి సంవత్సరం వర్షపాతం తగ్గుతున్న కారణంగా 2008 సంవత్సరం సమీపించే నాటికి ఊట బావుల భూగర్భ జలాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. 2009-10 సంవత్సరాల నుంచి జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రైతులు ఊట బావుల వినియోగాన్ని దాదాపుగా మానేసి, ప్రత్యామ్నాయంగా వ్యవసాయ గొట్టపు ( బోరు ) బావుల ఏర్పాటు వైపు దృష్టి కేంద్రీకరించారు. అప్పటి నుంచి దాదాపు పది సంవత్సరాల పాటు గొట్టపు బావుల నీటి సౌకర్యం ద్వారా వ్యవసాయాన్ని కొనసాగించిన రైతులు నేడు గొట్టం బావులలో కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోవడం మూలాన వ్యవసాయానికి సాగునీరు అందడం లేదని ఆవేదన చెందుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం నుంచి జహీరాబాద్ నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో వర్షపాతం కూడా క్రమం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో చెరువులు, కుంటలలో వర్షపు నీరు నిలువ లేకపోవడం కూడా భూగర్భ జలాలు ఇంకి పోవడానికి కారణంగా ఈ ప్రాంత రైతులు భావిస్తున్నారు.


Next Story