ఈ బీచ్‌లో అలా చేస్తే కుదరదు!

by  |
ఈ బీచ్‌లో అలా చేస్తే కుదరదు!
X

దిశ, వెబ్‌డెస్క్: సముద్రతీరాల్లో ఇసుక కావాల్సినంత ఉంటుంది. అక్కడికి సందర్శనకు వెళ్లినపుడు గుర్తుగా కొన్ని ఆల్చిప్పలు, శంఖువులు, బాగా నున్నగా ఉన్న రాళ్లు ఏరుకుని రావడం చాలా మంది టూరిస్టులకు ఒక అలవాటు. కానీ సార్డీనియా బీచ్‌లో అలా చేస్తే అస్సలు కుదరదు. రాళ్ల సంగతి పక్కన పెట్టండి, ఇసుకను తీసుకొచ్చినా జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఆ బీచ్‌ నుంచి ఓ ఫ్రెంచ్ టూరిస్ట్ రెండు కిలోల ఇసుకను దొంగిలించి తీసుకెళ్తుంటే అతన్ని పట్టుకుని 890 పౌండ్లు (అంటే రూ. 86,633) జరిమానా విధించారు. తీరప్రాంతాన్ని రక్షించడానికి సార్డినియన్ అధికారులు ఇలాంటి చర్యలను తీసుకుంటున్నారు.

తెల్లగా మెరిసే ఇసుక ఉన్న ఈ ఇటాలియన్ బీచ్‌లలో టూరిస్టుల కారణంగా క్రమక్షయం ఏర్పడి, సముద్ర జీవావరణం దెబ్బతింటున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి, ఒక్కొక్కరు తమ గుర్తుగా కొంత ఇసుకను తీసుకెళ్లడంతో ఆ ప్రాంతాల్లో జీవిస్తూ, ఇసుకలో గుడ్లు పెట్టే తాబేళ్లకు స్థలం లేకుండా పోతోందని, ఇసుకను తీయడం వల్ల గుంటలు ఏర్పడి అలల ద్వారా వచ్చిన నీళ్లు ఇక్కడ ఉండిపోతుండటం కూడా ఒక సమస్యగా మారిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అందుకే 2017లో సార్డినియన్ బీచ్‌ల నుంచి ఎలాంటి ఇసుకను, గులకరాళ్లను, ఆల్చిప్పలను తీసుకెళ్లడాన్ని నేరంగా ప్రకటిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించి జైలు శిక్ష అనుభవించిన టూరిస్టులు కూడా ఉన్నారంటే ఆ చట్టాన్ని అక్కడి అధికారులు ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.


Next Story