చెరువులో ఇసుక మైనింగ్.. నీళ్లు శూన్యం

by  |
చెరువులో ఇసుక మైనింగ్.. నీళ్లు శూన్యం
X

దిశ, నల్లగొండ: ఒకప్పుడు చుట్టపక్కల ప్రాంతాల్లోని పంటలకు నీరందించిన తంగడపల్లి చెరువు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. నీరు లేకపోవడంతో ఇసుకాసురుల చేతుల్లో బందీ అయిపోయింది. చెట్లు, పొదలతో ఏండ్లుగా నిండిపోయి ఉండటంతో అక్రమార్కులకు వరంగా మారింది. మిషన్ కాకతీయ కింద నిధులు విడుదలయినా పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడంతో కొందరు గుట్టుగా చెరువులోంచి ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో అతి పెద్ద చెరువుగా గుర్తింపు పొందిన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి పెద్ద చెరువు కింద ఒకప్పుడు రెండు వరి పంటలు సాగుచేసేవారు రైతులు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోగా… ఎగువ రాచకొండ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు సైతం రాకపోవడంవల్ల చెరువు ఎండిపోయింది. దీంతో ముళ్ల చెట్లు, పొదలతో చెరువు నిండి అడవిని తలపిస్తోంది. దీన్నీ ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు చెరువులోంచి యథేచ్చగా ఇసుకను తరలిస్తున్నారు. గతంలో చెరువుపై ఆధారపడి వెయ్యికి పైగా ఎకరాల్లో రెండు పంటలు సాగయ్యేవి. చేపల పెంపకంపై ఆధారపడి 100కు పైగా కుటుంబాలు జీవనం సాగించేవి.

పునరుద్ధరణ పనులు శూన్యం

ఏడేళ్ల క్రితం నుంచి చెరువులోకి చుక్క నీరూ రావడం లేదు. 2017లో మిషన్ కాకతీయ కింద పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు రూ.1.40 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 2017 మార్చి 23న నాటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు అక్కడికే పరిమితమయ్యాయి. పనులు చేపట్టాలని మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లకు మొరపెట్టుకున్నా… ఎవరూ పట్టించుకన్న పాపాన పోలేదని రైతులు వాపోతున్నారు. చెట్లు, పొదలతో నిండిన పెద్ద చెరువుపై ఇసుక మాఫియా కన్నేసింది. కొందరు రాజకీయనాయకుల అండదండలతో అదే ప్రాంతానికి చెందిన ఓ వర్గం ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తోంది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న అధికారులు నోరుమెదపకపోవడం గమనార్హం.

15 నుంచి 20 అడుగుల మేర గుంతలు

చెరువలో ఇసుక గుంతలు ఒక్కోటి 15 నుంచి 20 అడుగుల లోతు తవ్వారు. చెరువు ఒడ్డు నుంచి లోపలికి ట్రాక్టర్‌, ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది. ఇసుక అక్రమ రవాణాలో సుమారు 100 కుటుంబాలకు చెందిన వారు భాగస్వాములుగా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తే ఎదో ఒక పార్టీకి చెందిన నేత వచ్చి వారిని బయటకు తీసుకురావడం నిత్యకృత్యంగా మారింది. దీంతో చెరువుపై రైతులు, స్థానికులు ఆశలు వదులుకున్నారు.
ఈ చెరువు సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సరైన వర్షాలు లేక, ఎగువ రాచకొండ అటవీ ప్రాంతం నుంచి నీరు రాకపోవడం వల్ల 2012 నుంచి తంగడపల్లి పెద్దచెరువు తూము తెరవలేదు. చెరువుపైపు వెళితే ఇసుక మాఫియా ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులు అటు వైపు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.


Next Story

Most Viewed