దీపావళి కానుకగా ‘సామ్ జామ్’

by Shyam |
దీపావళి కానుకగా ‘సామ్ జామ్’
X

దిశ, వెబ్‌డెస్క్ :
నటిగా సెలెక్టివ్‌ పాత్రలను ఎంచుకుంటూ యాక్టింగ్ కెరీర్‌ కొనసాగిస్తున్న అక్కినేని కోడలు సమంత.. వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు పాటుపడుతోంది. అంతేకాదు ఓ వైపు గార్డెనింగ్ టిప్స్, మరోవైపు ఉపాసనతో కలిసి హెల్తీ టిప్స్ కూడా షేర్ చేస్తోంది. ఇలా క్షణం తీరక లేకుండా బిజిబిజీగా గడిపేస్తున్న సామ్.. వన్ డే బిగ్ బాస్ ‌హోస్ట్‌గానూ మెరిసి వావ్ అనిపించింది. కాగా సామ్ వన్ డే ఫర్మామెన్స్‌కే బుల్లితెర అభిమానులు ఫిదా అయిపోతే.. తను ఏకంగా ఓ షోనే హోస్ట్ చేస్తే అదిరిపోతుంది కదా! అందుకు ‘ఆహా’ వేదిక కానుంది. ‘సామ్ జామ్’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతోంది. నవంబర్ 13న స్ట్రీమింగ్ కానున్న ఆ షో.. సామ్ అభిమానులకు దీపావళి ధమాకా ట్రీట్ ఇవ్వనుంది.

అక్కినేని సమంత తొలిసారి ‘సామ్ జామ్’ అనే టాక్ షోతో హోస్ట్‌గా నెటిజన్ల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ఓ ఇంట్రో, మరో ప్రోమోను ఆహా ఒరిజనల్స్ తాజాగా విడుదల చేసింది. టాక్ షో ఇంట్రోను చూస్తే ఈ టాక్ షో తప్పనిసరిగా మూడు తరాల (చిల్డ్రన్స్, యూత్, ఓల్డేజ్) వాళ్లను ఎంటర్‌టైన్ చేసేలా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. అందుకే ఇంట్రో కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిజైన్ చేశారు. ఇక ప్రోమో విషయానికి వస్తే.. టైటిల్‌కి తగ్గట్టే సామ్ నుంచి ఫుల్ ఫన్‌ను ఆశించవచ్చని చెబుతోంది. వీడు డిసైడ్ అయిపోయాడు అంటూ.. సమంత తన పెంపుడు కుక్కను చూపించి చెప్పడం కూడా అందులో భాగమే అని తెలుస్తోంది. ఇక ఆ కుక్క మెడలో నవంబర్ 13 అనే ట్యాగ్ వేశారు. సో ‘సామ్ జామ్’ ఆహాలో దివాళి పండగ సందర్భంగా 13వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీ హోస్ట్‌గా సమంత ఏ మేరకు రాణిస్తుందో, ఈ టాక్ షో ఎలాంటి సంచలనాలకు వేదిక అవుతుందో చూడాలి.

‘ఆహా’ను మరో స్థాయికి తీసుకెళ్లే టాక్‌ షో ఇదని అల్లు అరవింద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకు ఎవరెవరితో ఈ షో రన్ చేస్తామనే విషయాలను పండుగ రోజున తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఇందులో సినిమాలు, క్రీడలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఆ లిస్టులో చిరంజీవి, విజయ్‌ దేవరకొండ, సైనా నెహ్వాల్‌-పారుపల్లి కశ్యప్‌, రష్మిక మందన్న, తమన్నా, అల్లు అర్జున్‌ తదితరులు ఉండటం విశేషం.

Advertisement

Next Story