‘సఖి’.. సుఖీభవ!

by Shyam |   ( Updated:2020-06-10 03:18:09.0  )
‘సఖి’.. సుఖీభవ!
X

దిశ, వరంగల్: మహిళల సమస్యల పరిష్కారానికి మోడల్‌గా సఖి కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. దాడులు, హింసకు గురైన మహిళలను తరలించడానికి సఖి కేంద్రం ద్వారా ఏర్పాటు చేసిన 181 అంబులెన్స్ సర్వీసును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహిళలు అణచివేతకు గురి కాకూడదనే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ, సఖి కేంద్రం సంయుక్త నిర్వహణలో చర్యలు చేపట్టిందన్నారు. మార్చి మూడో తేదీన జిల్లాలో ప్రారంభమైన సఖి కేంద్రం ద్వారా జిల్లాలో అణిచివేతకు, వేధింపులకు గురైన మహిళలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా లీగల్ సహకారం అందించి బాధిత మహిళకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సఖి కేంద్రం బలోపేతానికి జిల్లా కలెక్టర్గా పూర్తి మద్దతు ఇస్తానని, వివిధ సంస్థల సీఎస్ఆర్ నిధుల ద్వారా మహిళల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, ప్రతి ప్రభుత్వ శాఖలో మహిళల సంరక్షణ కోసం అంతర్గత కమిటీలను వేస్తున్నామన్నారు. సఖి కేంద్రం నిర్వహణకు కేఎస్ఆర్ ట్రస్ట్ ముందుకు రావడం సంతోషమని ఇదేవిధంగా మిగతా స్వచ్ఛంద సంస్థలు మహిళల సమస్యలపై పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి, జిల్లా యువజన సర్వీసులు అధికారి సునీత, కేఎస్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు, సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ గాయత్రి, సఖి కేంద్రం కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story