సైనాకు కరోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి అవుట్

by Shyam |   ( Updated:2021-01-12 01:22:44.0  )
సైనాకు కరోనా.. థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి అవుట్
X

దిశ, స్పోర్ట్స్: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కరోనా బారిన పడింది. దీంతో ఆమె థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. థాయ్‌లాండ్ ఓపెన్ ఆడటానికి బ్యాంకాక్ వెళ్లిన సైనాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె పాజిటివ్ అని తేలడంతో మంగళవారం టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. సైనాకు కరోనా రావడం ఇది రెండో సారి. కొన్ని వారాల క్రితం సైనా కరోనా బారిన పడి.. తర్వాత కోలుకున్నారు. ఆమె భర్త పారుపల్లి కశ్యప్ కూడా కరోనా బారిన పడటంతో వీరిద్దరూ గతంలో ప్రాక్టీస్ నుంచి తప్పుకున్నారు. 10 రోజుల క్రితమే తాము కరోనా నుంచి కోలుకున్నామని కశ్యప్ డిసెంబర్ 27 ప్రకటించాడు. తాజాగా బ్యాంకాక్ వెళ్లిన సైనాకు మూడు సార్లు పరీక్షలు నిర్వహించారు. తొలి రెండు పరీక్షల్లో నెగెటివ్ ఫలితమే వచ్చింది. అయితే సోమవారం నిర్వహించిన టెస్టులో మాత్రం పాజిటివ్‌గా తేలడంతో ఆమెను క్వారంటైన్‌కు తరలించారు.

మరోవైపు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ కూడా పాజిటివ్‌గా నిర్దారించబడ్డాడు. థాయ్‌లాండ్ ఓపెన్ ఆడటానికి సైనా బృందంతోనే కలసి అతడు ప్రయాణించాడు. అతడి టెస్ట్ రిజల్ట్ కూడా పాజిటివ్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. అతడు కూడా థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. కాగా, యోనెక్స్ థాయిలాండ్ ఓపెన్ జనవరి 12 నుంచి 17 వరకు బ్యాంకాక్‌లో జరుగుతున్నది.

Advertisement

Next Story