సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈయనే ఫైనల్ !

by Anukaran |
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈయనే ఫైనల్ !
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థిని పోటీలోకి దించేందుకు పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది. ఉపఎన్నిక టికెట్ కోసం ఆశావాహుల లిస్ట్ పెరిగిపోవడం.. రోజురోజూకీ మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారుకానుంది. అయితే సామాజిక వర్గాల వారీగానే కాకుండా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పలు సర్వేలను అధికార టీఆర్ఎస్ పార్టీ చేయించింది. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థి అయితేనే బెటరుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. దీంతో సీఎం కేసీఆర్ సైతం బీసీ అభ్యర్థిని రంగంలోకి దించేందుకు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ అల్లుడు కట్టబోయిన గురవయ్యయాదవ్‌ను రంగంలోకి దించేందుకు అంతా సిద్ధం చేసింది. ఈ మేరకు నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎవరూ ఊహించని విధంగా గురవయ్యయాదవ్ పేరు తెరపైకి రావడంతో రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఆ ఇద్దరి వల్లనేనా..?

వాస్తవానికి ఉపఎన్నిక టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నోముల నర్సింహాయ్య కుమారుడు నోముల భగత్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు బలమైన నేతను పోటీలోకి దించాలని సీఎం కేసీఆర్ మొదట భావించారు. కానీ సర్వేలన్నీ బీసీలకు పట్టం కట్టడంతో పార్టీ అధిష్టానం సైతం డైలామాలో పడింది. తీవ్ర తర్జనభర్జనల అనంతరం కట్టబోయిన గురవయ్యయాదవ్ పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి నోముల నర్సింహాయ్య యాదవ్ కొడుకు నోముల భగత్ బీసీ వర్గానికి చెందినా.. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ తలెత్తడంతో పార్టీ అధిష్టానం గురవయ్య యాదవ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే గురవయ్యయాదవ్.. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌కు అల్లుడు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌కు తోడల్లుడు. కావలి వైసీపీ ఎమ్మెల్యే మస్తాన్ రావుకు వియ్యంకుడు. 2018 సంవత్సరం వరకు కుందూరు జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామానికి చెందిన గురవయ్య యాదవ్.. 2018లోనే టీఆర్ఎస్‌లో చేరారు. బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పాటు ఆర్థికంగా ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ ఆయన వైపే మొగ్గుచూపింది.

ఆశావాహుల పరిస్థితి ఏంటి..?

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు టీఆర్ఎస్‌లో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగింది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, నోముల భగత్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరుల పేర్లు ప్రముఖంగా విన్పించాయి. వీరందరినీ కాదని అనుహ్యంగా కట్టబోయిన గురువయ్యయాదవ్ పేరు తెరపైకి రావడం.. ఆశావాహులకు మింగుడు పడడం లేదు. ఆశావాహులంతా ఉపఎన్నికలో పార్టీకి సహకరిస్తారా..? లేదా హ్యాండిస్తారా.? అన్న చర్చ తాజాగా జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed