వలసకూలీల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు

by Shyam |
వలసకూలీల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు
X

– దక్షిణ మధ్య రైల్వే ఆదేశం

దిశ, న్యూస్ బ్యూరో: కాలి నడకన సొంతూళ్లకు వెళ్తూ రైలుపట్టాలపై నిద్రపోతున్న 16 మంది వలస కూలీలను గూడ్సు రైలు ఢీకొని చనిపోయిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు దక్షిణ మధ్య రైల్వే ఆదేశించింది. ద.మ. రైల్వే పరిధిలోని నాందేడ్ డివిజన్‌లో ఈ ఘటన జరిగిన దృష్ట్యా రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలోని కమిటీ దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తుందని జనరల్ మేనేజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నాందేడ్ డివిజన్ పరిధిలోని మన్మాడ్-పర్బని సెక్షన్‌లో బద్నాపూర్-కర్మాడ్ స్టేషన్ల మధ్య పట్టాలపై నిద్రపోతున్న వలస కూలీలపైకి శుక్రవారం తెల్లవారుజామున 5.22 గంటలకు గూడ్సురైలు వచ్చింది. దాంతో 14 మంది అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు కొద్దిసేపటి తర్వాత చనిపోయారు. ఒకరు ఔరంగాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై ద.మ. రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్పందిస్తూ, రైలు పట్టాలపై మనుషులు పడుకున్న విషయాన్ని గూడ్సు డ్రైవర్ దూరం నుంచే గమనించారనీ, వారిని చెదరగొట్టడానికి హారన్ మోగించారనీ, గూడ్సును ఆపడానికి శాయశక్తులా కృషి చేశారని తెలిపారు. కానీ, ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో 16 మంది చనిపోయారని చెప్పారు. ఈ ఘటన వార్త తెలుసుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. నాందేడ్ డివిజనల్ మేనేజర్ పరిస్థితికి తగినట్లుగా వెంటనే డాక్టర్లు, వైద్య సిబ్బందిని మెడిల్ రిలీఫ్ వ్యాన్ రైల్లో తెప్పించారని చెప్పారు. ద.మ. రైల్వే జనరల్ మేనేజర్ సైతం వెంటనే వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఇప్పుడు సేప్టీ కమిషనర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి దర్యాప్తు అనంతరం ద.మ. రైల్వే తగిన చర్యలు
తీసుకుంటుందని తెలిపారు.

Tags: South Central Railway, Nanded, CPRO, General Manager, Migrant Workers, Death, Good Rail, Accident

Advertisement

Next Story

Most Viewed