రాష్ట్ర వ్యాప్తంగా సదర్ సంబురాలు: మంత్రి తలసాని

by Shyam |
రాష్ట్ర వ్యాప్తంగా సదర్ సంబురాలు: మంత్రి తలసాని
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో మాత్రమే నిర్వహించే సదర్ సమ్మేళనం ప్రస్తుతం మహబూబ్‌నగర్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా జరుగుతున్నాయని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. నగరంలోని నారాయణగూడ, లాల్‌బజార్ తదితర ప్రాంతాల్లో శనివారం జరగనున్న సదర్ ఉత్సవాల సందర్భంగా ఉత్తమమైన దున్నరాజాలను నిర్వాహకులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఆయన నివాసం దగ్గరకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ ఉత్సవాలు పరిమితమై ఉండేవని, కాలక్రమంలో కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తదితర జిల్లాలకు కూడా విస్తరించిందని, భవిష్యత్తులో మరిన్ని జిల్లాలకు కూడా వెళ్ళే అవకాశం ఉందన్నారు.

దీపావళి పండుగ తర్వాత ప్రతి ఏటా సదర్‌ ఉత్సవాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవి జరుగుతున్నాయని గుర్తుచేశారు. నారాయణగూడలో నిర్వహించే సదర్‌కు జాతీయస్థాయి గుర్తింపు కూడా లభించిందని గుర్తుచేశారు. ఈ నెల 5వ తేదీన ఖైరతాబాద్, ఎల్లారెడ్డిగూడ, లాల్‌బజార్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్నాయని, 6వ తేదీన నారాయణగూడలో జరుగుతుందని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మేలు రకం దున్న రాజాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వాటి పోషణ, సంరక్షణ కోసం నిత్యం చేసే కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఒక్కోదానిపై సగటున జరిగే ఖర్చు గురించి నిర్వాహకులు వివరించారు.

Advertisement

Next Story