‘సాదా బైనామాల’ పరేషాన్..!

by Anukaran |   ( Updated:2020-10-04 20:21:14.0  )
‘సాదా బైనామాల’ పరేషాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాదాబైనామాలు ఉన్నవారు LRSకు దరఖాస్తు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నా అధికారుల నుంచి పూర్తి సమాచారం రావడం లేదు. దీంతో వారు ఏమి చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు.

‘‘యాదగిరిగుట్టకు చెందిన వి. శ్రీనివాస్ తన తండ్రి పేర ఉన్న ఇంటి స్థలం సాదాబైనామాతో ఉన్నది. ఆ స్థలానికి LRS చేసుకోవాలని కనిపించిన ప్రతి అధికారినీ అడిగాడు. LRS ముగిసిన తర్వాత ప్రభుత్వం జారీచేసే గైడ్ లైన్స్ కు లోబడి తగిన నిర్ణయం తీసుకుంటామని కొందరు చెప్పగా, మరి కొందరు సాదాబైనామాలకు ఎల్ఆర్ఎస్ వర్తించదని చెప్పారు.. ఇంకొందరేమో సాదాబైనామాల స్థలాలను ఎల్ఆర్ఎస్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించలేదని తేల్చిచెప్పుతున్నారు. దీంతో శ్రీనివాస్, అతడి కుటుంబం ఆందోళన చెందుతోంది.. LRS గడువు ముగిసిన తర్వాత తమ పరిస్థితి ఏంటని..? ఆవేదన చెందుతోంది..

‘‘దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన ఆర్. నర్సింహా తన తండ్రి పేర సాదాబైనామాతో ఉన్న స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాలని ఎల్ఆర్ఎస్ కోసం అధికారులను సంప్రదించాడు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో నమోదు చేయించుకోండి. అనంతరం మీకు ప్రభుత్వం నుంచి ఓ ధ్రువీకరణ పత్రం అందుతుంది. అది వచ్చిన తర్వాత నాలా కన్వర్షన్ చేసుకోవాలి.. అప్పుడు మీకు ఇంటి అనుమతి మంజూరు చేసే అవకాశాలున్నాయని చెప్పారు. అనుమానం వచ్చిన నర్సింహా అప్పుడు ఎల్ఆర్ఎస్ చేసుకోలేదు కదా.. మీరు తిరస్కరిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. దీంతో తాము చేసేదేమి లేదని వారు బదులిచ్చారు. ’’

ఇలా.. అధికారులను సాదాబైనామాలతో సంప్రదిస్తున్న కొందరికి వారు చెప్పే సమాధానాలతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. మొత్తంగా ఎల్ఆర్ఎస్ గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే మార్గనిర్దేశకాల మేరకు తుది నిర్ణయముంటుందని వెల్లడిస్తున్నారు. దీంతో బాధితులు మరింత ఖంగుతింటున్నారు. ప్రభుత్వం వెంటనే సాదాబైనామాలున్న వారు కూడా ఎల్ఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

మున్సిపల్ చట్టం చెప్పిందిలా..

ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు కావాలన్నా.., ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలన్నా… అనుమతులున్న లేఅవుట్లలో, ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్లలో ఇంటి అనుమతి ఉన్న వాటికి మాత్రమే జరుగుతాయని తేల్చి చెప్పింది. కానీ చాలా మున్సిపాలిటీల్లో సాదాబైనామాలతో చాలా ఇండ్లున్నాయి. వాటి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. గ్రామాల్లో సాదాబైనామా ఉన్నవారు నేరుగా ధరణిలో అప్ లోడ్ చేస్తే ప్రభుత్వం జారీచేసే ధ్రువీకరణ పత్రంతో సాదాబైనామాల భూములను నాలా కన్వర్షన్ చేసుకోవాలని, ఆ తర్వాత ఇంటి అనుమతులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో చాలా మంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story