‘ఆన్‌లైన్ క్లాసులకు… వర్క్ షీట్లు కీలకం’

by  |
‘ఆన్‌లైన్ క్లాసులకు… వర్క్ షీట్లు కీలకం’
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పాఠాలు అర్థం అవుతున్నాయో… లేదో తెలుసుకోవడానికి వర్క్‌షీట్లు ఎంతో కీలకం అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ వర్క్‌షీట్ల ద్వారా ఫీడ్ బ్యాక్ లభిస్తుందని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో ఆదివారం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, గ్రామ పంచాయతీలకు అందిస్తున్న టీవీల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

మూడు భాషల్లో వర్క్ షీట్లను ఇస్తున్నట్టు, అంతేగాకుండా వికారాబాద్ జిల్లాలోని విద్యార్థుల నుంచి సేకరించిన వర్క్ షీట్లను సభలో చూపించారు. వర్క్‌షీట్లను బట్టి ఉపాధ్యాయులు కూడా తెలుసుకొని తదుపరి పాఠాలు బోధించటానికి దోహదపడుతుందన్నారు. వికారాబాద్ జిల్లాలో 85 శాతం మందికి పైగా విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు అనుసరిస్తున్నారని తెలిపారు. చదువు విలువ, గొప్పతనం తెలిసిన వారంతా నేటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, విద్యావంతులు విద్యార్థులు ఏ మేరకు డిజిటల్ విద్యపై శ్రద్ధ పెడుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డంపింగ్ యార్డ్, నర్సరీ, శ్మశానవాటిక, ట్రక్టర్, ట్యాంకర్ ఉందని చెప్పుకుంటున్నామో… అదే విధంగా వికారాబాద్ జిల్లాలోని పంచాయతీలలో టీవీ కూడా ఉందని గొప్పగా చెప్పుకోవచ్చన్నారు. టీవీకి కేబుల్, ఇంటర్నెట్ సౌకర్యాలను గ్రామ పంచాయతీల తరుపున కల్పించాలని సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. టీవీలు అందుబాటులోలేని వారి కోసం ఉపయోగపడేలా వికారాబాద్ జిల్లాలో 400 టీవీలు అందిస్తున్న ఎంపీ రంజీత్ రెడ్డిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.


Next Story

Most Viewed