ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రం : జక్కన్న

by  |
ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రం : జక్కన్న
X

పోలీసులను రియల్ హీరోలుగా అభివర్ణించారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్లాస్మా దాతల అభినందన సభలో పాల్గొన్న ఆయన.. సీపీ సజ్జానార్ అండ్ టీమ్ ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. కరోనా విషయంలోనే కాదు సమాజంలో ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించేందుకు ఒక ప్లాట్‌ఫామ్ తయారు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు.

కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం పోలీసులు ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని.. కరోనా బారినపడిన వారిని కాపాడేందుకు కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలంటూ అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం.. హాస్పిటల్స్‌తో కమ్యూనికేట్ అయి ప్రాణాలు కాపాడటమనేది గొప్ప విషయమని అభినందించారు.

అలాగే కరోనా నుంచి కోలుకున్న యువకులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చినా సరే, తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని విన్నామని.. ప్లాస్మా దానంతో మీ పిల్లలు హీరోలుగా మారే అవకాశాన్ని కోల్పోయేలా చేయొద్దన్నారు. ప్లాస్మా దానం వల్ల దాతల్లో ప్లాస్మా తగ్గే అవకాశం లేదని.. ప్లాస్మా డొనేట్ చేసే సమయంలో మళ్లీ కరోనా సోకుతుందనే ఆందోళనలు కూడా పెట్టుకోవద్దని సూచించారు. అధికార యంత్రాంగం, వైద్యులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రం లాంటిదని దయచేసి బాధ్యతాయుతంగా ప్రవర్తించి దానం చేయాలని కోరారు.

కరోనా అనేది కూడా ప్రాణాంతక వైరస్ ఏమీ కాదని, ఒక ఫ్లూ లాగే చాలా చిన్న వైరస్ అని, కానీ ఫస్ట్ స్టేజ్‌లోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమమని అన్నారు. కరోనా అంటే పక్కింటివాళ్లు ఏమనుకుంటారో అని చెప్పకుండా దాచేసి, కాంప్లికేట్ చేసుకోవద్దని సూచించారు జక్కన్న.


Next Story

Most Viewed