తుప్పుపడుతున్న చంద్రుడి ధ్రువాలు?

by Harish |
తుప్పుపడుతున్న చంద్రుడి ధ్రువాలు?
X

దిశ, వెబ్‌డెస్క్:

భూగ్రహానికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ధ్రువాల వద్ద తుప్పు పడుతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వారి ‘చంద్రయాన్ 1’ మిషన్ ద్వారా తెలిసింది. చంద్రయాన్ 1 ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని సమీక్షించి, చంద్రుని ధ్రువాల వద్ద తుప్పు ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఆక్సిజన్ సమక్షంలో ఇనుమును నీరు తాకినపుడు తుప్పు పుడుతుంది. అంటే దీన్ని బట్టి చంద్రుని మీద నీటి ఆనవాళ్లు ఉన్నాయనడానికి ఒక ఆధారం దొరికినట్లయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుని మీద ఎక్కువ మొత్తంలో ఇనుము ఉన్న సంగతి తెలిసిందే. అయితే దాన్ని తుప్పు పట్టించే స్థాయిలో ఆక్సిజన్, నీరు ఉన్నాయన్న సంగతి ఇప్పటి వరకు తెలియదు. తుప్పుకు సహకరించే వాతావరణం చంద్రుని మీద లేకపోవడంతో శాస్త్రవేత్తలు మరో దిశగా పరిశోధనలు మొదలు పెట్టారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వారు ఈ దిశగా పరిశోధన చేసి, చంద్రుని ధ్రువాలు తుప్పుపట్టడంలో భూమి పాత్ర కూడా ఉందని కనిపెట్టారు. సూర్యుని సౌర రేణువులు పెద్దమొత్తంలో చంద్రుని ఉపరితలం మీదకి వస్తాయి. అక్కడ ఎలాంటి వాతావరణం లేని కారణంగా హైడ్రోజన్ విడుదల పెరిగి, తుప్పు ఏర్పడటానికి వీలు కల్పించదు. దాన్ని తాకిన పదార్థాలకు ఎలక్ట్రాన్‌లను జోడించే లక్షణం హైడ్రోజన్‌కు ఉంది. కానీ ఇనుము, తుప్పుగా మారాలంటే ఎలక్ట్రాన్‌లను తొలగించాలి. కానీ ఇక్కడ భూమి తన మాగ్నటోటెయిల్ ప్రభావాన్ని చూపిస్తుంది. మాగ్నటోటెయిల్ ప్రభావం అంటే సూర్యుని వైపుగా విస్తరించి ఉన్న భూఅయస్కాంతక్షేత్రం. పౌర్ణమి రోజున ఇది సూర్యుని నుంచి చంద్రుని మీదకి వచ్చే 99 శాతం సౌరరేణువులను నిరోధిస్తుంది.

అలాగే అదే రోజున భూమ్మీది ఆక్సిజన్ కొద్దిమొత్తంలో చంద్రుని మీదకు సరఫరా అవుతుంది. ఈ విషయాన్ని 2007లో జపాన్‌కు చెందిన కగుయా ఆర్బిటర్ ధ్రువీకరించింది. ఇలా సరఫరా అయిన ఆక్సిజన్, అక్కడి హైడ్రోజన్ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా చంద్రుని ధ్రువాల మీది ఇనుముతో చర్యనొందుతుంది. అయితే ఈ చర్యకు కావాల్సిన నీరు ధ్రువాల వద్ద మాత్రమే ఉండటంతో కేవలం అక్కడే తుప్పు పడుతోందని నాసా శాస్త్రవేత్తలు వివరించారు. ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది.. చంద్రుని మీద పట్టే తుప్పు, భూమ్మీద పట్టే తుప్పు రెండూ ఒకే రకంగా ఉంటాయా? లేదంటే చంద్రుని రాళ్లలో రసాయన సమ్మేళనాల వల్ల ఏవైనా మార్పులు ఉంటాయా? అనే విషయాన్ని శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Next Story