రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ సమాప్తం

న్యూఢిల్లీ: రష్యాకు చెందిన గమెలియా ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా ట్రయల్స్ పూర్తయ్యాయని, రెగ్యులేటరీ నుంచి అనుమతి తీసుకోవడానికి కేవలం పేపర్ వర్క్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నదని రష్యన్ మీడియా రిపోర్ట్ చేసింది. పెద్దమొత్తంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అక్టోబర్‌లో టీకాను అందుబాటులోకి తెస్తామని ఆ దేశ ఆరోగ్య మంత్రి తెలిపారు. ఈ వ్యాక్సిన్ పొందే తొలి బ్యాచ్‌లలో టీచర్లు, డాక్టర్లుంటారని వివరించారు.

కానీ, ఈ టీకా మూడు దశల ట్రయల్స్‌ పూర్తి చేసుకున్నదా? లేక రెండు దశలనే పూర్తి చేసిందా? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, ఈ వ్యాక్సిన్ గతనెల 13న రెండో దశ ట్రయల్స్ ప్రారంభించినట్టు రష్యా తాస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. సాధారణంగా వాలంటీర్లలో కరోనాను ఎదుర్కొనే ఇమ్యూన్ రెస్పాన్స్‌ను పరిశీలించే రెండో దశ ట్రయల్స్‌కు నెలలవ్యవధి పడుతుంది.

అయితే, ప్రస్తుత ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిజజీవితంలో ఈ టీకా ప్రభావాన్ని అంచనా వేసే మూడో దశ ట్రయల్స్‌కు ముందే వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి. వేలాది మందిపై ప్రయోగాలు జరిపే ఈ మూడో దశ ట్రయల్స్‌ పూర్తి కావడానికి కొన్నిసార్లు ఏళ్లకాలం పడుతుంది. రష్యా టీకా మూడో దశ ట్రయల్స్‌కు సమాంతరంగా ప్రజలకు చేరువకు తీసుకువస్తున్నట్టు తెలిసింది.

కానీ, రష్యా టీకా వేగంపైనా ఆందోళనలు వెలువడుతున్నాయి. ఈ టీకాకు రెగ్యులేటరీ అనుమతులు సులువగానే అందవచ్చునని, టీకా ట్రయల్స్, ఫలితాలపై పారదర్శకత లేదని పేర్కొంటూ పలువురు నిపుణులు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా, చైనా వ్యాక్సిన్‌లను అమెరికా వినియోగించబోదని ఆ దేశ టాప్ నిపుణులు ఆంథోని ఫౌచీ అన్నారు.

Advertisement