‘అధికారం’లోనే ఆమెకు అవమానాలు!

by Shyam |
‘అధికారం’లోనే ఆమెకు అవమానాలు!
X

దిశ, కూకట్‌పల్లి : అధికార పార్టీ నాయకులు, అధికారుల తీరు అన్ని డివిజన్లలో ఒక లెక్క ఈ డివిజన్ లో ఒక లెక్క అన్నటుగా ఉంది. ప్రజల చేత ఎన్నికైనా మహిళా ప్రజాప్రతినిధిని అధికారులు, అధికార పార్టీ నాయకులు అడుగడుగునా అవమానిస్తున్నారు. రెండేళ్లుగా బాలానగర్ డివిజన్‌లో ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించినా కార్పొరేటర్‌కు మాత్రం ఎటువంటి ఆహ్వానం అందదు. శిలాఫలకంలో కూడా కనీసం ఆమె పేరు పెట్టకపోవడం గమనార్హం. ఈ విషయమై అధికారులను అడిగిన అయ్యో పేరు లేదా..? అని ప్రశ్నించడం వారి నర్లక్ష్యాన్ని, ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది.

కూకట్‌పల్లి నియోజకవర్గంలో బుధవారం రూ.19కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఓ పండుగ వాతావరణంలో జరిగాయి. బేగంపేట్ డివిజన్ నుంచి కేపీహెచ్‌బీ డివిజన్ వరకు పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పాత కార్పొరేటర్లు, తాజాగా గెలిచిన కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే, నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలు ప్రస్తుత కార్పొరేటర్ల పేర్లతో ఏర్పాటు చేయగా కేవలం బాలాజీనగర్ డివిజన్ పరిధిలో భువన విజయం గ్రౌండ్‌లో, ధనలక్ష్మి సెంటర్‌లలో జరిగిన ఇండోర్ షటిల్ కోర్టు, నాలా అభివృద్ధి పనులకు సంబంధించిన శిలా ఫలకంలో ప్రస్తుత కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి పేరును మాత్రం అధికారులు మరిచారు. అంతేగాక ఈ కార్యక్రమ ప్రారంభానికి కార్పొరేటర్‌కు కనీసం పిలుపు రాకపోవడం గమనార్హం. కాగా, శిలాఫలకంపై కావ్యారెడ్డి పేరు పెట్టొవద్దన్న ఆదేశాలు అధికార పార్టీ నాయకుల నుంచి ఉన్నట్టు సమాచారం. ఇంకా ఫిబ్రవరి వరకు పదవీకాలం ఉన్న ఓ మహిళా కార్పొరేటర్‌ను ఉద్దేశ్య పూర్వకంగా పిలవకపోవడం నియోజవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

అధికారుల పొంతనలేని సమాధానాలు..

ప్రోటోకాల్ ప్రకారం నియోజకవర్గంలోని ఏ డివిజన్‌లో అభివృద్ధి పనులు జరిగినా పార్టీలకతీతంగా అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలి. కానీ, బాలాజీనగర్ డివిజన్‌లో జరిగిన రెండు కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకంలో స్థానిక కార్పొరేటర్ పన్నాల కావ్యారెడ్డి పేరు లేకుండా ఏర్పాటు చేయడంపై మూసాపేట్ సర్కిల్ డీసీ రవికుమార్‌ను వివరణ కోరగా ప్రోటోకాల్, శిలాఫలకానికి సంబంధించిన పని ఇంజినీరింగ్ విభాగం అధికారులు చూసుకుంటారని సమాధానం ఇచ్చారు. ఈఈ నాగేందర్ యాదవ్‌ను వివరణ కోరగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఫీఆర్ విభాగం వారు ఇచ్చిన పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేస్తామని, జోనల్ అధికారులకు తెలుసని సమాధానం ఇచ్చారు. కాగా, ఈ విషయమై కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమతను వివరణ కోరగా శిలాఫలకంలో కార్పొరేటర్ పేరు లేదా…? అని ప్రశ్నించారు. శిలాఫలకంలో పేర్లు పూర్తిగా ఇంజినీరింగ్ అధికారుల పని అని, వాళ్లు మాత్రమే చూసుకుంటారని సమాధానం ఇచ్చారు.

శిలాఫలకాల పంచాయతీ పాతదే…

నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా శిలాఫలకం ఏర్పాటు విషయంలో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఏర్పాటు చేస్తే ఒకరికి కోపం, చేయకపోతే మరొకరికి కోపం. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 9 డివిజన్లలో గత ఎన్నికల్లో కేపీహెచ్‌బీ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. కాగా, గతేడాది క్రితం సదరు కార్పొరేటర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా బాలాజీనగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన కార్పొరేటర్ కావ్యారెడ్డి, ఆమె భర్త ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రెండేళ్ల క్రితం బీజేపీలో చేరారు.

దీంతో కార్పొరేటర్ కావ్యారెడ్డికి అప్పటి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు పిలుపు అందడం లేదు. అంతేగాక, ఏ అధికారి కూడా ఆమె మాట వినకూడదన్న ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా మల్కాజిగిరి ఎంపీగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఎంపీ పేరు పెట్టాల్సి వస్తుందని నియోజకవర్గంలో పలుచోట్ల కనీసం శిలాఫలకం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఎంపీ రేవంత్ రెడ్డి జోనల్ కమిషర్ మమతపై ఫైర్ అయిన ఘటనలు ఉన్నాయి.

రెండేండ్లుగా పిలుపు లేదు..

మూసాపేట్ సర్కిల్ అధికారులు పూర్తిగా అధికార పార్టీ చెప్పు చేతల్లో ఉన్నారు. గడిచిన రెండేండ్ల కాలంలో జరిగిన ఏ ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. నియోజకవర్గంలో మంత్రులు పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో మహిళా కార్పొరేటర్ ని అయినా కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానిస్తున్నారు. – పన్నాల కావ్యారెడ్డి, కార్పొరేటర్, బాలాజీనగర్

Advertisement

Next Story