నీట మునిగిన డీటీఓ నూతన కార్యాలయం

by  |
నీట మునిగిన డీటీఓ నూతన కార్యాలయం
X

దిశ, జనగామ: అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల ప్రజా ధనం నీటి పాలైంది. జనగామ-హైదరాబాద్ రోడ్డులోని కంబాలకుంటలో నిర్మించిన ప్రభుత్వ భవనం నీట మునగడం జిల్లా అధికారుల డొల్లతనానికి అద్దం పడుతోంది. జనగామ మండలం పెంబర్తి శివారులోని కంబాలకుంటలో రవాణా శాఖ కార్యాలయం కోసం రెండెకరాల స్థలాన్ని కేటాయించారు. సుమారు రూ.60 లక్షలకు పైగా నిధులను కేటాయించి నిర్మాణ బాధ్యతలను జిల్లా ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. ఆ స్థలం ఎఫ్‌టీ‌లో ఉన్నప్పటికీ ఆయా శాఖ అధికారులు ముందస్తు వరద ముప్పును గ్రహించకుండా ఆదరబాదరాగా కార్యాలయ నిర్మాణ పనులు పూర్తి చేశారు. నిర్మాణం కోసం మ్యాప్ తయారు చేసే సమయంలో కుంట పరిధిలోని కావడంతో ముప్పు వస్తే ప్రమాదం ఉంటుందా అనే కోణంలో ఆలోచన చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల కురిసిన వర్షానికి డీటీఓ కార్యాలయం నీట మునిగింది. ప్రతిసారి కంబాలకుంటకు నీరు వచ్చిన సమయంలో డీటీఓ భవనం మునిగిపోతుండటంతో ఆ శాఖ అధికారులు అందులోకి వెళ్లేందుకు జంకుతున్నారు. నీటి మధ్యలో సగం వరకు బిల్డింగ్ మునిగి ఉన్న దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అనుమతి ఇచ్చిన అధికారుల తీరుపై మండి పడుతున్నారు. ఈ విషయమై డీటీఓ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. సుమారు రూ.60 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మాణం చేసారని, ప్రతి ఏడాది వర్షాకాలంలో వరద నీరు చేరి మునిగిపోతున్నందున ఆ భవనంలోకి మారేందేకు ఆసక్తి చూపడం లేదన్నారు. ఎఫ్‌టీ‌ఎల్ ఫరిధిలోని కంబాలకుంటలో భవనం నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed