రేవంత్‌పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని నివేదిక

by Shyam |   ( Updated:2020-03-04 00:03:43.0  )
రేవంత్‌పై క్రిమినల్ చర్యలు చేపట్టాలని నివేదిక
X

దిశ, న్యూస్ బ్యూరో : గోపన్‌ పల్లిలో భూ అక్రమాలకు తెరలేపిన రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండల్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని రాజేంద్ర‌నగర్ ఆర్డీవో చంద్రకళ మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్ కుమార్‌ను కోరారు.రేవంత్ భూ ఆక్రమణలపై విచారణ చేపట్టిన ఆర్టీవో ఆయన చేసిన అక్రమాల చిట్టాను నివేదిక రూపంలో కలెక్టర్ సమర్పించారు. సర్వేనెంబర్ 127లో జరిగిన భూ మ్యుటేషన్లు, కబ్జాలు అక్రమమైనవని నివేదికలో పొందుపరిచినట్టు వెల్లడించారు.అంతేకాకుండా వాల్టా చట్టం నిబంధనలు ఉల్లంఘించినందుకు రేవంత్ బ్రదర్స్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆమె కోరారు. కాగా, గోపన్‌పల్లిలో సర్వే నెంబర్ 127లో బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోవడంతో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గత వారం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆర్డీవో చంద్రకళ గోపనపల్లిలోని భూ బాగోతాలపై విచారణ ముమ్మరం చేశారు. అనంతరం 18 పేజీల నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.
ఈ నివేదిక ప్రకారం 2004-05లో మొదటిసారి పహాణీలో రేవంత్‌రెడ్డి పేరు చేరగా, మరికొందరి పేరుతో 10 ఎకరాల 21గుంటల భూమి పహాణీలో నమోదై ఉందని తేల్చారు.2005లో అప్పటి డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పలు రికార్డులను తారుమారు చేసిన విషయం తెలిసిందే. 1954 నుంచి 1958 వరకు పహాణీలో సర్వే నెం.127లోని భూమి వడ్డే హనుమ పేరు మీద ఉంది. అనంతరం 1964 నుంచి 1972 వరకు సర్వే నెం.127 వడ్డే లక్ష్మయ్య పేరు మీద కూడా పట్టా అయి ఉంది. మరల 1972 నుంచి 1977 వరకు సర్వే నెం.127 అనేది వడ్డే మల్లయ్య పేరు మీద నమోదైనట్టు రికార్డుల్లో చూపిస్తుంది.ఆ తర్వాత వడ్డే మల్లయ్య పేరుతో ఉన్న పట్టా కాస్త ఇంటి పేరు లేని మల్లయ్యగా రూపాంతరం చెందింది. 1993-94 వరకు డబ్బా మల్లయ్య పేరు మీదకు మారింది. ఆ తర్వాత హక్కుదార్ల పేర్లు కూడా పెరుగుతూ వచ్చాయని నివేదికలో తెలిపారు. సర్వే నెం.127లోని భూమిని ఎవరు ఎప్పుడు కొనుగోలు చేశారో ఆర్డీవో చంద్రకళ డాక్యుమెంట్‌ నెంబర్లతో సహా నివేదికలో క్లుప్తంగా పొందుపరిచారు.
ఇదిలాఉండగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ అక్రమాలకు పాల్పడింది నిజమేనని నిర్దారణ కావడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోసారి ఏ రాజకీయ నాయకులు నిరుపేదల భూముల జోలికి వెళ్లకుండా ఉండేలా, రేవంత్ సోదరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story