ఇకపై ఆర్టీసీ కార్మికులకు వేధింపులుండవ్..!

by Anukaran |   ( Updated:2021-02-04 13:12:25.0  )
ఇకపై ఆర్టీసీ కార్మికులకు వేధింపులుండవ్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రతకు మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సంతకం చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు యాజమాన్యంపై గతంలోనే ఫిర్యాదు చేశారు. యూనియన్లను రద్దు చేసిన తర్వాత ప్రతి డిపోకు ఐదుగురితో సీఎం కేసీఆర్​ ప్రగతిభవన్‌లో సమావేశమైన నేపథ్యంలో వీటిని సీఎం దృష్టికి తీసుకుపోయారు. వందల మందితో ప్రయాణం చేసే సమయంలో టికెట్లు ఇచ్చేటప్పుడు కండక్టర్​చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఒక్కరో, ఇద్దరో తప్పిపోతే దానికి కారణంగా కండక్టర్‌ను చూపించవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రయాణికులతో పాటుగా చిన్నపాటి వస్తువులను తీసుకువస్తే వాటిపై కేసులు నమోదు చేశారని, ఆ తప్పును కండక్టర్‌పై వేస్తున్నారని, వాటి నుంచి రక్షణ కల్పించాలంటూ కోరారు. డ్రైవింగ్ అంశాల్లో కూడా డ్రైవర్ల తప్పు లేకున్నా సస్పెండ్​చేస్తున్నారన్నారు. అయితే చాలా మంది సస్పెండ్‌లో ఉండి రిటైర్​అవుతున్నారని, ఆ తర్వాత కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటుందని, కానీ అప్పటికే నష్టం జరుగుతుందని వివరించారు. మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు కేటాయించడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకుపోవడంతో వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఆయన అప్పుడే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగ భద్రతకు మార్గదర్శకాల కోసం ఉన్నతాధికారుల కమిటీని ఆదేశించింది. వారు చెప్పిన సమస్యల నుంచి ఉపశమనం కల్పించేలా అధికారులు మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని సీఎం కేసీఆర్​గురువారం ఆమోదించారు.

ఇక నుంచి ప్రతి ఆరోపణలపై విచారణ చేయాల్సిందేనని, టికెట్ల అంశంలో కండక్టర్లపై చర్యలు తీసుకోకుండా ప్రయాణికులను బాధ్యులుగా చేయాలంటూ మార్పులు తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేక కమిటీని జిల్లాల వారీగా వేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఆర్టీసీలో జిల్లా బదిలీలకు కూడా అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి కూడా సీఎం ఆమోదం చెప్పినట్లు తెలుస్తోంది. గ్రేటర్‌తో పాటు పలు జిల్లాల నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వాటికి కూడా పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed