బ్యాంకులకు రూ. 400 కోట్లకు పైగా టోకరా!

by  |
బ్యాంకులకు రూ. 400 కోట్లకు పైగా టోకరా!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో బ్యాంకులను మోసం చేసే సంఘటనలు పెరిగిపోతున్నాయి. పలు బ్యాంకులకు వందల కోట్ల బకాయిలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఉదంతం ఆలస్యంగా బయటకొచ్చింది. ఢిల్లీకి చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారు రామ్‌దేవ్ ఇంటర్నేషనల్ యాజమాన్యం బ్యాంకుల కన్సార్టియంకు రూ. 414 కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది. రామ్‌దేవ్ కంపెనీ ఎస్‌బీఐకి రూ. 173.11 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ. 76.09 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 51.31 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 64.31 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ. 36.91 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ. 12.27 కోట్ల బకాయి పడ్డట్టు ఎస్‌బీఐ తెలిపింది.

కంపెనీ డైరెక్టర్లు సురేష్ కుమార్, నరేశ్ కుమార్, సంగీతలు 2016 నుంచి మిస్సింగ్‌లో ఉన్నారని, గత ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ డిఫాల్టర్లపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై సీబీఐ ఏప్రిల్ 28న కేసు బుక్ చేసింది. సదరు డైరెక్టర్లతో పాటు మరికొందరిపై ఫోర్జరీ, చీటింగ్ వంటి క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2016 నుంచి రామ్‌దేవ్ కంపెనీకి చెందిన బకాయిలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించారు. ఆలస్యంగా ఫిర్యాదు చేయడం గురించి ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది. సంవత్సరం క్రితమే నిందితులు పరారీలో ఉన్నట్టు నిర్ధారణ అయిందని వెల్లడించింది. రామ్‌దేవ్ ఇంటర్నేషనల్ కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కోర్టులో మరో కేసుపై మూడు సార్లు హాజరయిందని, ఈ కేసు విచారణ సందర్భంలోనే నిందితులు పరారైనట్లు డిసెంబర్ 2018లో వెల్లడైనట్లు ఎస్‌బీఐ వివరించింది. నిందితులు చాలా భాగం వారి ఆస్తులను అమ్ముకుని పారిపోయినట్టు, బకాయిలను రాబట్టే మార్గం లేనట్టు ఎస్‌బీఐ సీబీఐని సంప్రదించింది.


Next Story

Most Viewed