ఐటీ రంగానికి రూ.360 కోట్లు

by Shyam |
ఐటీ రంగానికి రూ.360 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : 2021-2022 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఐటీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం రూ.360 కోట్ల కేటాయింపులు చేసింది. గతేడాది కంటే ఈ ఏడాది అదనంగా బడ్జెట్‌ను కేటాయించింది. ఐటీ ఎగుమతులు 2014-15లో రూ.66,276 కోట్లు ఉండగా, 2019-20 లో రూ.1,28,807 కోట్లకు చేరింది. ప్రభుత్వం ఐటీకి పెద్దపీట వేయడం, పరిశ్రమలకు అనుమతులతో పాటు రాయితీలు ఇస్తుండటంతో ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు డాబా టీస్ సెంటర్లను హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఐటీ ఉత్పత్తులకు కేంద్రంగా తెలంగాణ అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

ఐటీ కంపెనీలకు హైదరాబాద్ హబ్‌గా మారిందని, తెలంగాణ ప్రభుత్వం అంకుర సంస్థల ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన ‘టీ-హబ్’ దేశానికి రోల్ మోడల్ అని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న మంత్రి హరీశ్‌రావు.. మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ‘వీ-హబ్’ విజయవంతంగా పని చేస్తోందని తెలిపారు. హైదరాబాద్ అర్బన్ ఏరియాలోని కొంపల్లి, కొల్లాపూర్, శంషాబాద్, ఉప్పల్, పోచారంలో ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ విస్తరణకు టవర్స్‌ను ప్రభుత్వం నిర్మించిందని, ఇటీవల సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ఐటీ టవర్స్‌కు శంకుస్థాపన చేశారని తెలిపారు. ఐటీ ఎగుమతుల వృద్ధి రేటులో దేశ సగటు 8.09 శాతం కాగా, రాష్ట్రం వృద్ధి రేటు 17.93 శాతమని పేర్కొన్నారు. వాహన కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇంధన పొదుపు కోసం ‘ఈ-వెహికల్’ పాలసీని ప్రభుత్వం రూపొందించి ఎలక్ట్రికల్ వాహనాల తయారీకి పెట్టుబడి, రవాణా పన్నుపై సబ్సిడీని కల్పించిందని మంత్రి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed