సెప్టెంబరుకల్లా కరోనా ఖతం

by Shyam |   ( Updated:2020-08-08 09:37:47.0  )
సెప్టెంబరుకల్లా కరోనా ఖతం
X

దిశ, న్యూస్‌బ్యూరో: గత కొన్ని వారాలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం గణనీయంగా తగ్గిందని, ఇది మరింతగా తగ్గుముఖం పడుతూ ఈ నెల చివరికల్లా కరోనా రహిత నగరంగా మారుతుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సెప్టెంబరు చివరికల్లా రాష్ట్రంలో కరోనా ఖతం అయ్యే అవకాశాలు ఉన్నాయని నొక్కిచెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమకు నిత్యం జిల్లా వైద్యాధికారులు, కలెక్టర్ల నుంచి వస్తున్న వివరాల ప్రకారం ఈ అంచనాకు వచ్చినట్లు వివరించారు. ఎప్పటికప్పుడు వైద్యశాఖ సిబ్బంది కొత్త పాజిటివ్ కేసుల గురించి సమాచారం ఇస్తూ ఉన్నారని, గణాంకాలు కూడా వస్తూ ఉన్నాయని, వాటిని విశ్లేషించిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ఆగస్టు చివరికల్లా, మిగిలిన జిల్లాల్లో వచ్చే నెల చివరికల్లా కరోనా మాయమవుతుందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1100 టెస్టింగ్ సెంటర్లలో సగటున 23వేల పరీక్షలు చేస్తున్నామని, కానీ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం బాగా తగ్గుతోందన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే పాజిటివిటీ రేటులోగానీ, కరోనా మృతుల విషయంలోగానీ తెలంగాణ చాలా మెరుగ్గా ఉందని, ఐదారు నెలలుగా చేపట్టిన కృషే ఇందుకు కారణమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సమకూర్చుకుందని, ఇందులో సగం అయిపోయాయని, మరో పది లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చామని, వాటిలో రెండు లక్షలు వచ్చాయని, మిగిలినవి త్వరలోనే అందుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనరల్ ఆసుపత్రుల మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు మొత్తం బెడ్‌లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తున్నామని, ఇప్పటికే సుమారు పది వేల బెడ్‌లకు సమకూరిందని, రానున్న రోజుల్లో అన్నింటికీ కల్పిస్తామన్నారు.

కేసులు, మరణాల్లో దాపరికం లేదు

జిల్లాల్లో నమోదవుతున్న కేసులకు, రాష్ట్ర బులెటిన్‌లో కనిపిస్తున్న లెక్కలకు పొంతన లేదని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, కరోనా పాజిటివ్ కేసులనుగానీ, మరణాలనుగానీ దాచడం సాధ్యం కాదని, అబద్ధపు గణాంకాలు ఇవ్వాల్సిన అవసరమే లేదన్నారు. కరోనా మరణాల్లో జాతీయ సగటు 2.6%గా ఉన్నా తెలంగాణలో మాత్రం అది ఒక శాతం కంటే తక్కువేనని అన్నారు. కరోనా కేవలం పది రోజుల జబ్బు మాత్రమేనని, మొదటి వారం రోజుల ట్రీట్‌మెంట్‌కు ఒక ప్రోటోకాల్, ఆ తర్వాత మరో రకంగా ఉంటోందని, కోలుకుంటున్నారని వివరించారు. ఈ వైరస్ బారిన పడిన తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయని, అందువల్లనే ఆక్సిజన్ సౌకర్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సిద్ధం చేసుకుంటున్నామని, వెంటిలేటర్ అందరికీ అవసరం లేదన్నారు.

హోమ్ ఐసొలేషన్ కిట్ల పంపిణీ

చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు ఉండడంలేదని, అలాంటివారిని హోమ్ ఐసొలేషన్‌లో ఉంచుతూ వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని, ఇప్పటికి 86,600 ఐసొలేషన్ కిట్లను వివిధ జిల్లా కేంద్రాలకు పంపించామని, జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 20వేల కిట్లను పంపిణీ చేసినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. ఎక్కడికక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు హోమ్ ఐసొలేషన్‌లో ఉండేవారికి సమాచారంతో కూడిన బుక్‌లెట్‌తో పాటు పదిహేను రకాల ఐటెమ్‌లను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కిట్లలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను కూడా అందిస్తున్నామని తెలిపారు. దీనికి తోడు ఆసుపత్రులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు, వివిధ రకాల ఔషధాలను కూడా సమకూరుస్తున్నామని, ప్రభుత్వం ఇటీవల రూ. 100 కోట్లను విడుదల చేసిందని, ఈ డబ్బును వివిధ రకాల అవసరాల కొనుగోళ్ళకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది కొరత ఉన్నచోట్ల కూడా అదనంగా రిక్రూట్‌మెంట్ చేపట్టి వారి జీతాలకు కూడా ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

ప్రైవేటు ఆసుపత్రులను మూసేయాలన్న ఉద్దేశం లేదు

కేవలం రెండు ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ప్రైవేటు ఆసుపత్రుల జోలికి వెళ్ళడంలేదని, వాటిపై చర్యలు తీసుకోడానికి వెనకాడుతోందని ప్రశ్నించగా వాటిని మూసివేయాలన్నది ప్రభుత్వ ఉధ్దేశం కాదని బదులిచ్చారు. ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నందున ప్రజలు ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్‌‌ను అందుబాటులోకి తెచ్చామని, ఇప్పటివరకు 1,036 ఫిర్యాదులు వచ్చాయని, అందులో 130 అధిక ఫీజులకు సంబంధించినవేనని వివరించారు. హెల్త్ ఇన్సూరెన్సుకు సంబంధించి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటికి అనుగుణంగా ఆయా ఆసుపత్రుల యాజమాన్యానికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడం ద్వారా వాటిని మూసివేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాదని, కానీ ప్రజల ఫిర్యాదులకు అనుగుణంగా వాటిని నియంత్రించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తొలుత కరోనా పాజిటివ్ బారిన పడినవారికి వైద్య సేవలందించడం ప్రజారోగ్య శాఖ ప్రాధాన్యతగా ఉంటుందని, ఆ తర్వాతనే తక్కువ సీరియస్‌నెస్ కలిగిన ప్రైవేటు ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించడం ఉంటుందన్నారు.

రెమిడిసివిర్ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా వాడకూడదు: డీఎంఈ

కరోనా చికిత్సకు వాడే రెమిడిసివిర్ ఇంజక్షన్లు లేదా మాత్రలను డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా వాడరాదని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సాధారణంగా పారాసిటమాల్, యాంటీ బయాటిక్ వాడినంత సులభంగా వీటిని వాడడం మంచిదికాదని, చాలా దుష్పరిణామాలు ఉంటాయన్నారు. కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ లక్షణాలు లేనప్పుడు రెమిడిసివిర్ ఔషదాన్ని వాడవద్దని నొక్కిచెప్పారు. ఇప్పుడు కరోనా చికిత్స అన్ని జిల్లా కేంద్రాల్లో లభిస్తున్నందున హైదరాబాద్ నగరం వరకూ రావాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా వచ్చి తగ్గిపోయినవారి ప్లాస్మాలో యాంటీ బాడీస్ ఉంటాయని, కానీ ఇవి సంజీవనిలాగా ఉంటాయనే భ్రమలు మంచిదికాదన్నారు. పాజిటివ్ వచ్చినా వారిలో కరోనా లక్షణాలు లేనప్పుడు పదిహేను రోజుల తర్వాత నెగెటివ్ అని నిర్ధారణ అయినా వారిలో యాంటీ బాడీస్ ఉత్పత్తికావని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed