ఇచ్చట గదులు ఖాళీ లేవు.. లెక్కింపు అయ్యేదాక ఆగాల్సిందే..!

by Sridhar Babu |
ఇచ్చట గదులు ఖాళీ లేవు.. లెక్కింపు అయ్యేదాక ఆగాల్సిందే..!
X

దిశ, కరీంనగర్ సిటీ : హోటళ్లు, లాడ్జీలు, ఇతర ప్రైవేట్ వసతి గృహాల ఎదుట గదులు అద్దెకు లభించునంటూ బోర్డులు కనిపించడం సాధారణమే. ఏ సీజన్లో అయినా అడిగిన వెంటనే గదులు దొరుకుతుంటాయ్. అయితే, రెండు రోజులుగా నగరంలోని పైన పేర్కొన్న చోట్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇచ్చట గదులు ఖాళీ లేవంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొద్ది గంటల పాటు అయినా పర్వాలేదు ఇవ్వండి అన్నా.. సారీ మరో ఐదురోజుల దాకా అడ్వాన్స్ బుక్ అయ్యాయంటూ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. దీంతో, రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు కూడా నగరంలోని లాడ్జీలు, హోటళ్లలో గదులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టార్ హోటళ్ల నుంచి మొదలు పడక మంచాల వసతి ఉన్న లాడ్జీల్లో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, గత కొద్ది రోజులుగా హుజురాబాద్‌లో తమ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.

బుధవారం సాయంత్రం నుంచి ప్రచార పర్వం ముగియడంతో స్థానికేతరులు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో వారంతా కరీంనగర్‌కు తమ మకాం మార్చారు. తమకున్న పరిచయాలు, ఆయా పార్టీల స్థానిక నాయకుల సిఫారసుతో బుక్ చేసుకుని, సేద తీరుతున్నారు. అద్దె ఎంతైనా మంచిదే తమకు మాత్రం రూములు కావాలనే ధోరణితో ఉండటంతో యజమానులు మూడింతల అద్దె పెంచి ప్రచారానికి వచ్చిన వారికే ఇచ్చేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. త్రిముఖ పోటీ నెలకొన్న నియోజకవర్గంలో మూడు పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేపట్టగా, ఎవరికి వారు తీసిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ కేడర్‌ను ప్రచారంలోకి దించారు.

వీరితో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఆయా పార్టీల ముఖ్య నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించగా, వారు తమ అనుచరగణాన్ని కూడా వెంటేసుకుని వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. గడువు ముగియగానే ఇతర ప్రాంతాల నేతలు, కార్యకర్తలు ఎక్కడివారక్కడ వెళ్లిపోవాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇలాంటి ఉపఎన్నికను చూడకపోగా, ఆ సెగ్మెంట్లో నెలకొన్న పరిస్థితుల దృష్యా ఆయా పార్టీల అధినాయకత్వం అందుబాటులో ఉండాలని సూచించినట్లు తెలుస్తుంది. దీంతో నవంబర్ రెండో తేదీ సాయంత్రం వరకు వారంతా నగరంలో ఉన్న లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు కూడా బుక్ చేసుకుని ఉంటున్నట్టు సమాచారం. కాగా, సాయంత్రం దాకా ప్రచార రణగొన ధ్వనులతో సందడిగా ఉన్న హుజురాబాద్ ఒక్కసారిగా బోసిపోగా నగరంలోని మెస్‌లు, మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు కిక్కిరిసిపోతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed