‘ఎమ్మెల్యే ముత్తన్న’.. రోడ్లు ఇట్లా.. పోవుడెట్లా..?

by Shyam |
‘ఎమ్మెల్యే ముత్తన్న’.. రోడ్లు ఇట్లా.. పోవుడెట్లా..?
X

దిశ ప్రతినిధి, మెదక్ : ఏళ్లు గడుస్తున్న రహదారులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. పలుమార్లు అధికారులను ప్రశ్నించిన, ప్రజాప్రతినిధులను ఎదురించిన సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. హైద్రాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారి పక్కనే ఉన్న చేర్యాల – జనగామ రహదారి అడగడుగున గుంతలమయంగా మారింది. పైగా సింగిల్ వే రోడ్డు. దీనిపై ప్రయాణించేందుకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయమైన రహదారికి కనీసం మరమ్మతైనా చేయించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆ ప్రాంత ప్రజలు పలుమార్లు అడ్డుకున్నారు. అయనా ఆ ఎమ్మెల్యే నుండి ఇంత వరకు ఎలాంటి స్పందన లేదు.

గుంతలమయంగా రహదారులు …

జిల్లాల పునర్విభజలో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలోకి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేర్యాల పట్టణం వస్తుంది. సిద్దిపేట, నిజామాబాద్, ఇతర ప్రాంత ప్రజలు నల్గొండ, సూర్యాపేట, యాదగిరి గుట్ట , భువనగిరి, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే చేర్యాల, జనగామ మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. సిద్దిపేట రాజీవ్ రహదారి దుద్దెడ టోల్ గేట్ దాటాకా వెలికట్ట నుండి ప్రారంభమైన రహదారి అడుగడుగున గుంతల మయంగా మారింది. సుమారు నలభై కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి. దీనికితోడు ఇటీవల కురిసిన వర్షాలకు మరింతగా రహదారులు దెబ్బతిన్నాయి. దీనిపై ప్రయాణం చేయాలంటే వాహనదారుల వెన్నులో వణుకు పుడుతున్నది.

ఇదే దారిలో కొమురవెల్లి …

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారంత చేర్యాల నుంచే కొమురవెల్లి రావాల్సి ఉంటుంది. ఈ రోడ్డంతా గుంతలమయంగా మారడంతో కొమురవెల్లి వచ్చేందుకు భక్తులు నానా తంటాలు పడుతూ రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయమై కొమురవెల్లి ప్రజలు సైతం పలుమార్లు ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. అయినా ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించేదు.

ఎమ్మెల్యేపై స్థానికుల అగ్రహం ..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహర తీరుపై ఆది నుండి స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకోని ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ గతంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఎమ్మెల్యే తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల చేర్యాల మండలం చిట్యాల గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేపై స్థానిక ప్రజలు అగ్రహం వ్యక్తంచేశారు. రెండు పర్యాయాలు గెలిపించాక కూడా మా గ్రామాన్ని అభివృద్ధి చేయవా .. మా గ్రామంలో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. దీంతో వెంటనే పల్లె ప్రగతిలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి గుంతలమయంగా మారిన రహదారిని మరమ్మతు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

రోడ్లు బాగు చేయించాలి…

సిద్దిపేట జిల్లాలో చేర్యాల మండలమే అత్యంత వెనుకబడింది. ఈ ప్రాంతాన్ని పట్టించుకునే నాదుడే కరువయ్యారు. జనగామ ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు గెలుపొందిన యాదగిరిరెడ్డి ఈ ప్రాంత సమస్యలను పట్టించుకోవడం లేదు. నిత్యం ఈ రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ రోడ్లను బాగు చేయించాలి. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో పెద్దయెత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతాం.
-ఆముదాల మల్లారెడ్డి, సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి

Advertisement

Next Story

Most Viewed