గేమ్‌షోలో ఐదు కోట్లు.. ఇప్పుడేమో దారుణం!

by  |
గేమ్‌షోలో ఐదు కోట్లు.. ఇప్పుడేమో దారుణం!
X

దిశ, వెబ్‌డెస్క్: కష్టపడకుండా వచ్చిన సొమ్ము మన దగ్గర ఎక్కువ కాలం ఉండదు, ఎంత ఉండాలో అంతే ఉంటుంది, అది ఎలా వచ్చిందో అలాగే వెళ్తుందని మోటివేషన్ పాఠాల్లో వింటుంటాం. ఆ పాఠాల్లో దీని గురించి ఎన్నో ఉదాహరణలు కూడా ఇస్తారు. అలాంటిదే ఒక ఉదాహరణ ఇటీవల ఓ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలిసింది. ఆ పోస్ట్ చేసిన వ్యక్తి పేరు సుశీల్ కుమార్. ఇలా అంటే గుర్తుపట్టడం కష్టం. కేబీసీ సుశీల్ కుమార్ అంటే చాలా మందికి తెలుస్తుంది. అవును.. కేబీసీ అంటే అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా చేసే కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమమే. 2011 నవంబర్‌లో ఈ షో ఐదో సీజన్‌లో ఐదు కోట్ల రూపాయలు గెలుచుకున్న సుశీల్ కుమార్ అప్పట్లో మీడియాకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాడు. కానీ ఆ డబ్బు గెలవడమే తన జీవితాన్ని దారుణంగా మార్చేసిందని ఇటీవల సుశీల్ కుమార్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎందుకు?

జాక్‌పాట్ గెలుచుకున్న తర్వాత సుశీల్ ఒక సెలెబ్రిటీ అయ్యాడు. నెలలో పదిహేను రోజులు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, కార్యక్రమాల్లో పాల్గొనడంతో బిజీగా ఉండేవాడినని, దీంతో పోటీ పరీక్షల ప్రిపరేషన్ అటకెక్కిందని సుశీల్ పేర్కొన్నాడు. ఇక దానికి తోడు అప్పనంగా వచ్చిన డబ్బు కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే ప్రయత్నంలో తాను మద్యపానం, సిగరెట్‌కు బానిసైనట్లు తెలిపాడు. అంతేకాకుండా ఎవరిని పడితే వారిని నమ్మి పెద్ద మొత్తాల్లో మోసపోవడంతో ఇంట్లో భార్యతో గొడవలు పెరిగి, దాదాపుగా విడాకులు తీసుకునే పరిస్థితి కూడా వచ్చిందని వెల్లడించాడు. 2015 నుంచి 2016 మధ్య తనకు గడ్డుకాలం నడిచిందని, చారిటీల పేరుతో స్నేహితులు మోసం చేశారని చెప్పాడు. ఇంట్లో ఏం పని చేయకుండా రోజంతా సిగరెట్ తాగుతూ సినిమాలు చూసేవాడినని, ఆ తర్వాత సినిమా తీయడానికి బీహార్ నుంచి ముంబైకి వెళ్లి దారుణంగా నష్టపోయానని తెలిపాడు. ఆ తర్వాతే ఫేమస్ అవడం కంటే మంచి మనిషిగా బతకడం వెయ్యి రెట్లు ఉత్తమమని గ్రహించి తిరిగి బీహార్‌లో సొంతింటికి వచ్చినట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఒక టీచర్‌గా పనిచేస్తూ, చెడు అలవాట్లను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. ఏదేమైనా కష్టపడకుండా వచ్చిన సొమ్ము, వచ్చిన దారిలోనే హారతి కర్పూరంలా కరిగిపోతుందని చెప్పడానికి తానే ఒక నిదర్శనమని సుశీల్ బాధపడ్డాడు.

Read Also…

‘యూట్యూబ్‌’ను ఫాలో అవుతున్న దొంగలు..


Next Story

Most Viewed