అకాల వర్షం.. రైతులకు ఇక మిగిలింది ‘కన్నీరే’

by Shyam |
అకాల వర్షం.. రైతులకు ఇక మిగిలింది ‘కన్నీరే’
X

దిశ, కాటారం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వలన శుక్రవారం సాయంత్రం కాటారం, మలహార్ మండలాల్లోని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి, మలహార్ మండలంలోని కొయ్యూరు గ్రామంలో రైతులు బయట ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షం అన్నదాతకు శోకాన్ని మిగిల్చింది. వరి, పత్తి పంటలు చేతికొచ్చాక సమయంలో నోటి కాడి ముద్ద లాగినట్టుగా అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది.

కొన్ని గ్రామాల్లో వరి కోతలు ముమ్మరమయ్యాయి. ధాన్యం రాశులు కుప్పలుగా పోసి విక్రయించేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల మాత్రమే విక్రయాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వేలాది ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఇప్పుడిప్పుడే పత్తిని తీస్తున్నారు రైతులు. ఇలాంటి సమయంలో ఈ భారీ వర్షం కురవడంతో పత్తి చేన్లలో మొక్కలపై ఉన్న పత్తి కాస్త తడిసిపోగా, కోత దశలో ఉన్న పత్తి నేలరాలింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి భారీ వర్షాలు కురియడంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు కురిసిన అకాల వర్షం రైతుకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed