బ్లాక్‌ మెయిలింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌ రెడ్డి

by Ramesh Goud |
Balka Suman
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి బ్లాక్‌ మెయిలింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్కా సుమన్‌ విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి తీరు గుమ్మడికాయ దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లు ఉందని విమర్శించారు. ఈటల భూ అక్రమాలపై నలుగురు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీ వేసిందని, అన్ని విషయాలు బయటకొస్తే రేవంత్‌ రెడ్డి నిజస్వరూపం తేలుతుందన్నారు. దేవరయాంజల్‌ భూముల్లో అక్రమాలను ప్రభుత్వం నిగ్గు తేల్చుతుందని పేర్కొన్నారు.

అక్రమాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్‌ను సమర్థించాల్సింది పోయి.. బట్టకాల్చి మీదేస్తారా.! అని నిలదీశారు. ఏ విషయమైనా విచారణలో బయటకొస్తుంది.. అప్పుడే ఆగమాగం ఎందుకు అని ప్రశ్నించారు. బినామీల వ్యవహారం బయటపడుతుందని రేవంత్‌ రెడ్డి భయం పట్టుకుందని, ప్రజాక్షేత్రంలో అందరి సంగతి తేలుతుందన్నారు. రేవంత్‌ తీరు గురవిందను గుర్తు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.

రేవంత్‌ రెడ్డి కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నాడు కాబట్టే భయపడుతున్నాడని అన్నారు. భూ అక్రమాలపై నలుగురు ఐఏఎస్‌ అధికారులతో సీఎం కేసీఆర్‌ విచారణ కమిటీ వేశారంటేనే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story