లంచం తీసుకోవడంలో ఈ ఆఫీసర్లే ఫస్ట్

by  |
లంచం తీసుకోవడంలో ఈ ఆఫీసర్లే ఫస్ట్
X

దిశ, క్రైమ్ బ్యూరో: పాలనలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ శాఖలో కొందరు లంచాలను మరిగి జనాలను పీడిస్తున్నారు. పనుల నిమిత్తం ఆఫీసులకు వచ్చేవారిని మూమూళ్ల పేరుతో వేధిస్తూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలలో పడినవారిలో రెవెన్యూ శాఖకు చెందినవారే అత్యధికంగా ఉన్నారు. రెండేండ్ల గణాంకాలు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. కొందరి వల్ల మొత్తం రెవెన్యూ వ్యవస్థే అభాసుపాలవుతోందంటూ సిన్సియర్ అధికారులు ఆవేదన చెందుతున్నారు.

కంచే చేను మేసిన చందంగా తయారైంది రెవెన్యూ శాఖ పరిస్థితి. ప్రభుత్వ భూములను కాపాడాల్సినవారు కబ్జాదారులతో చేతులు కలుపుతూ ప్రభుత్వాన్నే మోసం చేస్తున్నారు. హైదరాబాద్ షేక్‌పేట మండలం బంజారాహిల్స్ భూ వివాదంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నాగార్జున్ రెడ్డి రూ.50 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.30 లక్షల డీల్ కుదుర్చుకున్నాడు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ వలకు చిక్కాడు. తహసీల్దార్ సుజాత నివాసంలో రూ.30 లక్షల నగదు, కిలోకి పైగా బంగారం ఆభరణాలు, విలువైన పత్రాలు లభ్యమయ్యాయి. ఆర్ఐ నాగార్జునరెడ్డి నేరుగా రిమాండ్ కాగా, నగదు, ఆభరణాలకు లెక్కలు చూపించలేక తహసీల్దార్ సుజాత జైలు పాలైంది. భార్య జైలుకెళ్లడాన్నితట్టుకోలేని సుజాత భర్త సూసైడ్ చేసుకున్నారు. బంజారాహిల్స్ వివాదంలో ఫిర్యాదుదారుడు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన స్థలం గురించి మాట్లాడుతున్నారు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైన మరో కబ్జా స్థలం వివాదాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతోంది రెవెన్యూ శాఖ. ఇదే కేసులో బంజారాహిల్స్ ఎస్ఐ రవీంద్రనాయక్ రూ.1.50 లక్షలు లంచంతో ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఈ కేసును మరింత లోతుగా పరిశీలించిన ఏసీబీ ఫిర్యాదుదారుడి వద్ద ఉన్న డాక్యుమెంట్లు బోగస్ వని తేల్చింది. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసు అధికారులకు లేఖ రాసింది. సుమారు రూ.40 కోట్ల విలువ చేసే ఎకరాకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుడికి రూ.30 లక్షలకు కట్టబెట్టాలని చూశారు రెవెన్యూ అధికారులు. దీంతో రెవెన్యూ శాఖలో అవినీతి ఎంత లోతుగా వేళ్లూనుకుందో అర్థమవుతోంది.

రెండేండ్లుగా టాప్‌లోనే

అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్నవారిలో అనేక శాఖల అధికారులు ఉంటున్నప్పటికీ, అత్యధికంగా ట్రాప్ అవుతున్నవారు రెవెన్యూ ఉద్యోగులే. ఈ ఏడాది జూన్ ఆరున షేక్‌పేట ఆర్ఐ రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాగర్ కర్నూలు కలెక్టరేట్లో సెక్షన్ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్ మారం జయమ్మ ఫిబ్రవరి 24న రూ.10 లక్షలు డిమాండ్ చేసి, అందులో రూ. లక్ష తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి వీఆర్వో రూ.17వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. జనవరి 10న జూబ్లీహిల్స్ సీఐ బల్వంతయ్య, ఎస్ఐ సుధీర్‌రెడ్డి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

2018లో 139 మంది ప్రభుత్వ అధికారులు ట్రాప్ కాగా, అందులో రెవెన్యూ అధికారులు 37 మంది, పోలీసులు 20 మంది, మున్సిపల్ శాఖ అధికారులు 15 మంది, విద్యుత్ శాఖకు చెందిన అధికారులు 13 మంది ఉన్నా రు. 2019లో 173 మంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కగా, వారిలో రెవెన్యూ శాఖలో 54 మంది, పోలీస్ శాఖలో 18 మంది, మున్సిపల్ శాఖలో 25 మంది, విద్యుత్ శాఖకు చెందిన అధికారులు 10 మంది ఉన్నారు. 2020 జనవరి నుంచి జూన్ వరకూ 44 కేసుల్లో రెవెన్యూ 8 మంది, పోలీసులు ఏడుగురు, మున్సిపల్ శాఖ ఆరుగురు లంచావతారులు ఏసీబీకి చిక్కారు. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని ఓ బాధితుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Next Story

Most Viewed