పెద్దమ్మ దేవాలయంలో రేవంత్​రెడ్డి ఏం చేశాడంటే ?

by Shyam |   ( Updated:2021-07-07 01:57:38.0  )
పెద్దమ్మ దేవాలయంలో రేవంత్​రెడ్డి ఏం చేశాడంటే ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. టీపీసీసీ చీఫ్​గా నియమాకమైన రేవంత్ ఇవాళ గాంధీ భవన్ లో పదవీ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఉత్తమ్​ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు బాధ్యతలు తీసుకుని అక్కడే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఉదయం 1‌0.30 గంటలకు జూబ్లిహిల్స్​లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలు దేరిన రేవంత్ రెడ్డి పెద్దమ్మ ఆలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్​ శ్రేణులు ఆ ర్యాలీలో ఫుల్​ జోష్​ చూపించాయి. రోడ్డు వెంట బాణాసంచా పేల్చారు. రేవంత్​ నినాదాలతో హోరెత్తించారు.

పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మళ్లీ ర్యాలీగా బయలుదేరారు. మధ్యాహ్నం వరకు నాంపల్లి దర్గాకు చేరుకుని అక్కడ ప్రార్థనలు చేయనున్నారు. ఆ తర్వాత గాంధీభవన్​కు చేరుకుంటారు. రేవంత్​రెడ్డి భారీ కాన్వాయ్‌తో వస్తుండగా కాంగ్రెస్​ నేతలు పలువురు బైక్​ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు రేవంత్​రెడ్డి పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్యం ఠాగూర్​ బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్​ మధుయాష్కి కూడా ఢిల్లీ నుంచి ఠాగూర్​తో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్​పోర్ట్​లో ఠాగూర్​కు ఘనంగా స్వాగతం పలికారు.

కాగా గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమంలో రేవంత్‌తో పాటు కొత్తగా నియమితులైన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం వరకు కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ మాజీ నాయకుడు మలికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌లు అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్న నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, పార్టీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

జీవన్​రెడ్డి లేఖ

రేవంత్​రెడ్డికి అభినందనలు తెలుపుతూ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి లేఖ పంపించారు. కాంగ్రెస్​ పార్టీలో నూతనోత్తేజాన్ని నింపాలని, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని లేఖలో ఆకాంక్షించారు.

Advertisement

Next Story