సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

by Anukaran |   ( Updated:2020-08-09 07:53:22.0  )
సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
X

దిశ, న్యూస్‎బ్యూరో : కృష్ణా బేసిన్‌లో ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహాకారం ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ పరోక్ష సహకారం ఉందని, అపెక్స్ కౌన్సిల్ వాయిదాకు లేఖ రాయడమే దీనికి నిదర్శనమన్నారు.

నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ను ఎందుకు తొక్కి పెట్టారని, లక్షా 7 వేల ఎకరాలకు సాగునీరు రాకుండా చేసిన పాపం సీఎం కీసీఆర్‌దేనని లేఖలో పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో నారాయణపేట్, కొడంగల్ ప్రాంతాలకు ఒరిగేది ఏమీ లేదని, పాలమూరు-రంగారెడ్డి స్కీం సామర్థ్యంలో ఒక టీఎంసీ తగ్గించారని, ఆ ప్రాజెక్టు నుంచి నారాయణపేట్, కొడంగల్‌కు నీళ్లు రావడం కలేనని లేఖలో మండిపడ్డారు. నారాయణపేట్-కొడంగల్ స్కీం ఉమ్మడి రాష్ట్రంలోనే మంజూరైందని, తొలి దశకు రూ. 133 కోట్ల నిధులు కూడా మంజూరయ్యాయన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా ఆ ప్రాజెక్టును తొక్కిపెట్టారని, నారాయణపేట్-కొడంగల్ స్కీంను తక్షణం ప్రారంభించాలని, ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణలో సక్రమ ప్రాజెక్టులు కూడా కట్టడం లేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ కీలక నేతలు తెలంగాణ ప్రాజెక్టుల్లో వేల కోట్ల పనులు చేస్తున్నారని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై సుప్రీంలో వేసిన కేసులో పసలేదని లేఖలో సీఎం కేసీఆర్ తీరును రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు.

Advertisement

Next Story