మనిషి ‘పెద్దరికం’.. మనీకి చుట్టరికం

by Shyam |
మనిషి ‘పెద్దరికం’.. మనీకి చుట్టరికం
X

దిశ, వెబ్‌డెస్క్:
ప్రపంచం అష్ట వంకర్లు తిరుగుతున్నా.. పాశ్చాత్య ధోరణులు ప్రతి ఇంటినీ ఆవహిస్తున్నా.. అరచేతిలోనే అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నా.. పాడి పంటలతో విలసిల్లే పల్లెలు పట్టణవాసానికై ఉవ్విళ్లూరుతున్నా.. బూజు పట్టిన సిద్ధాంతాలకు మంగళం పాడుతున్నా.. ఇంకా మనం వదిలిపెట్టని పద్ధతులు గ్రామాల్లో ఇప్పటికీ చలామణిలోనే ఉన్నాయి. వీటితో లాభమా..నష్టమా ? అన్న చర్చ పక్కనబెడితే.. వీటి నిర్వహణ మాత్రం కాస్త విభిన్నం. అవే పెద్ద మనుషులు నిర్వహించే పంచాయితీ తీర్మానాలు..

పోలీసులు, కోర్టులతో పనిలేకుండా స్థానికంగా సమస్యలను పరిష్కరించడమే వీరి పని. ప్రతి కమ్యూనిటీకి ఓ పెద్ద మనిషి ఉండటం కామన్. ఆ కమ్యూనిటీలోని ఏ సమస్య అయినా ముందుగా వారి వద్దకే చేరడం కామనే. ఇంకొంచెం పెద్ద సమస్య అయితే.. తరువాతి స్థాయిలో సర్పంచ్‌తోపాటు గ్రామంలో కాస్త పలుకుబడి ఉన్న టీమ్ ఉండనే ఉంది. మ్యాటర్ కొంచెం వివాదాస్పదమై.. ఇరువర్గాలు ఆర్థికంగా బలంగా ఉన్నవారైతే ఈ పంచాయతీల్లో ఆరితేరిన బ్యాచ్‌(సెటిల్‌మెంట్ బ్యాచ్) ఎంటర్ అవ్వడం అనివార్యమే. ఈ వ్యవహారాన్నంతా మన కోర్టు భాషలో చెప్పాలంటే.. డివిజన్ బెంచ్, జిల్లా కోర్టు, ఆపై హైకోర్టు అన్నమాట. ఈ పనిని ఒక జాబ్‌లా చేసే ప్రొఫెషనల్స్‌కు కొదువే లేదు. ఎందుకంటే వారు ఒక్కో పంచాయితీకి ఇంత అని చార్జ్ చేస్తుంటారు. అంతేకాక పంచాయితీ తీర్మానానికి ముందే న్యాయం కోసం ఆశ్రయించిన ‘ఇరు పార్టీలతో’ వేలల్లో నగదును డిపాజిట్ చేయించి, జడ్జిమెంట్ తర్వాత ఆ డబ్బుతో విందులు చేసుకోవడమూ వారి ప్రొసీడింగ్స్‌లో భాగమే !

భూ ప్రక్షాళన తీర్పుల్లో విశ్వసనీయత ఎంత?

చిన్న, చిన్న సమస్యలకు సామరస్యంగా పరిష్కారం చూపే ప్రయత్నం అక్కడ జరుగుతుండవచ్చు. కానీ, వివాదాస్పద అంశాల్లో లోపాయికారీ ఒప్పందాలు, ఇతరత్రా ప్రలోభాలు అక్కడ న్యాయనిర్ణేతలైన పెద్ద మనుషులను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయనడంలో వాస్తవం లేకపోలేదు. అందుకే కొన్ని సమస్యలకు పరిష్కారం అంత సులువుగా లభించదు. ఏండ్లుగా పెద్దమనుషులు సదరు సమస్యను నాన్చుతూ పబ్బం గడుపుతూ ఉంటారు. భూ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీ ప్రక్రియలోనూ ఈ తరహా సమస్యలు అనేకం చోటుచేసుకున్నాయి. వ్యవసాయ భూములకు సంబంధించి పక్క పొలం వారితో సరిహద్దు పంచాయితీల్లో ‘పెద్ద మనుషులు’ కీలకపాత్ర పోషిస్తారనేది నిజం. కానీ, సరైన వ్యక్తికి న్యాయం చేశారా అంటే.. కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఒక్కోసారి బాధితుడికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. చివరకు అతడు అందుకునే ప్రతిఫలం కన్నా ఈ పంచాయితీ తీర్మానాల ఖర్చే తడిసి మోపెడైన సంఘటనలు మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ సమస్యలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లవా.. అంటే అంతంత మాత్రమే.

పోలీస్ స్టేషన్లలో పంచాయితీల తీరు..

ఊళ్లో పెద్ద మనుషులతో పరిష్కారం కావని భావిస్తేనో లేదా వారిపై నమ్మకం లేకపోతేనో తప్ప.. సమస్యలు పోలీస్ స్టేషన్‌కు చేరవు. పోనీ, వెళ్లినా అక్కడా పాత కథే ఎదురవుతుంది. ఎస్సై లేదా సీఐ బాధిత పక్షాలను పిలిచి స్టేషన్ ఆవరణలో పెద్ద మనుషులతోనే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సెలవిస్తాడు. తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం మూలాన సదరు పెద్ద మనుషులకు స్టేషన్‌లో కాస్త గౌరవం దక్కడం సహజం. ఎందుకంటే ప్రతి పంచాయితీకి బాధితుల చేత అక్కడి సిబ్బందికి డబ్బులు ఇప్పించడం మన పెద్దమనుషులకు అలవాటు. ఏ పోలీస్ స్టేషన్‌ ఆవరణలో చూసినా నిత్యం ఇలాంటి సెటిల్‌మెంట్ ఏదో ఒకటి మనకు తారసపడుతూనే ఉంటుంది. కానీ, పోలీస్ శాఖలో అందరూ అదే తీరున వ్యవహరిస్తారని చెప్పలేం. పెద్ద మనుషులతో సంబంధం లేకుండా సమస్యకు పరిష్కారం చూపేవారు కూడా ఉంటారు. ప్రజాకోర్టుల పేరుతో గ్రామాల్లోనే పంచాయితీలు నిర్వహించి సమస్యలు పరిష్కరించిన పోలీసులు కూడా ఉన్నారు. కానీ వారికి సహకారం తక్కువనే చెప్పాలి.

తీర్పులు.. శిక్షలు

అణగారిన కులాలపై పూర్వం ఈ పంచాయితీల్లో వేసే శిక్షలు అనాగరికంగా ఉండేవనేది పెద్దలమాట. ఆధిపత్యకులాలవారే పెద్ద మనుషులుగా చలామణిలో ఉండటమూ ఇందుకు కారణం. ప్రస్తుతం ఆ తరహా ఆధిపత్య మూలాలు కొంతమేర తగ్గినా.. రాష్ట్రంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు పాత గాయాలను తట్టిలేపుతున్నాయనేది నిజం. సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటేయలేదంటూ.. సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులు పంచాయతీలు నిర్వహించడం, కొన్ని చోట్ల బాధితులను గ్రామ బహిష్కరణ చేయించిన తీర్పులను చూశాం. ప్రేమించి మోసం చేసిన ఘటనల్లో బాధిత మహిళలకు పరిహారం ఇప్పించే తీర్మానాల గురించి తరచూ వింటూనే ఉన్నాం.. ఇవన్నీ నాగరిక సమాజాన్ని మరింత వెనక్కి లాగే తీర్పులే.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాత పద్ధతులకు స్వస్తి చెప్పి.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ఊతమిచ్చిన సంగతి తెలిసిందే. పల్లెప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తున్న విషయమూ విదితమే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేర కొత్త రాగం అందుకున్నారు. ఉద్దేశం మంచిదైనా గ్రామాల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారే.. ప్రస్తుతం వీడీసీలో సభ్యులుగా, చైర్మన్‌లుగా నియమించబడ్డారు. ఇంకేం గ్రామ రాజకీయాలన్నీ వారి గుప్పిట్లోనే. ఇటీవల నిజామాబాద్‌లో పీఏసీఎస్ ఎన్నికల్లో ఓటింగ్‌కు అవకాశమే లేకుండా ‘వీడీసీ’ కమిటీనే డైరెక్టర్లను ఎన్నుకోవడమూ ఈ వ్యవస్థపైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం పురోగమిస్తున్న క్రమంలో అశాస్ర్తీయ, ఏకపక్ష తీర్పులను, తీర్మానాలను రూపుమాపాల్సిన అవసరం ఉందనుకుంటే.. అవి సరికొత్త రూపం దాల్చుకోవడం సమాజ పురోగమనమో.. తిరోగమనమో.. కాలమే నిర్ణయించాలి!

Tags : Telangana, Village, White collar, VS DC, Police, Politics

Advertisement

Next Story