- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగాల భర్తీ కంటే ముందే.. టీఆర్ఎస్‌లో నామినేటెడ్ పోస్టుల జాతర!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైందని పార్టీ నుంచి సంకేతాలిస్తున్నారు. ఈ సాగర్ ఉప ఎన్నిక తర్వాత నామినేటెట్ పోస్టుల భర్తీని చేపడతారని సమాచారం. చాలా కాలంగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిందని, పలు కారణాలతో పోస్టుల భర్తీ చేయడం లేదనే ప్రచారం ఉంది. ఇటీవల హైకోర్టు మొట్టికాయలతో మహిళా కమిషన్ను నియమాకం చేశారు. ఇదే సమయంలో పార్టీ నేతల్లో అసంతృప్తి కూడా వ్యక్తమవుతోంది. ఏండ్ల నుంచి జెండా మోస్తున్న నేతలు కొన్నిచోట్ల బహిరంగంగానే విమర్శలకు దిగాల్సి వస్తోంది. దీంతో ఈ దఫా ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులను ఇస్తారని పార్టీ వర్గాలు గట్టిగానే చెప్తున్నాయి.
వివిధ చిన్నా,పెద్ద పదవులు కలుపుకుని దాదాపు రెండున్నర వేల వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నట్టు చెప్పుతున్నారు. వీటితో పాటుగా పార్టీలోనూ పదవులను నింపేందుకు కసరత్తులు మొదలైనట్టు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో 50 వేల కొలువులు భర్తీ చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కొలువుల భర్తీ కంటే ముందుగా పార్టీ నేతలకు పదవుల భర్తీ చేయాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
అంత ఈజీ కాదు..!
తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు పోస్టులు రాకున్నా సర్దుకుపోయిన నేతలు… రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పదవీ కాలం సగానికి పైగా పూర్తయిన నేపధ్యంలో నామినేటెడ్ పోస్టుల కోసం సీఎం కేసీఆర్పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పదవుల భర్తీని ఇంకా ఆలస్యం చేస్తే పార్టీలో అసంతృప్తి, ఇతర సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన కేసీఆర్ ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన జాబితా సిద్ధం అయిందనే ప్రచారం సాగుతోంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన పేర్లను ముందుగానే బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క సారి పేర్లు బయటికి వస్తే తమపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అంటున్నారు.
దక్కించుకోవాల్సిందే..!
ఈసారి నామినేటెడ్ పదవుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కేబినెట్లో ఉద్యమంలో లేనివారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించారనే విమర్శలున్నాయి. ఉద్యమ సమయంలో కొంతమేరకు వెన్నుదన్నుగా నిలిచిన వారిలో కొందరికి ఇప్పటికే అక్కడో, ఇక్కడో స్థానాన్ని కల్పించారు. తాజాగా రాజ్యాంగబద్ధమైన పలు సంస్థల్లో పదవులు ఖాళీ అయ్యాయి. ఈ పోస్టుల కోసం చాలా మంది పార్టీ సీనియర్లు, అధికార వర్గాల్లో ముఖ్యులు చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ పోస్టులు కొద్ది నెలలుగా భర్తీకి నోచుకోకుండా ఉంటున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీసీ కమిషన్ చైర్మన్ల పదవీకాలం ముగిసిపోగా.. త్వరలోనే మరికొన్ని ఖాళీ కానున్నాయి. ఇలాంటి పదవులపై కన్నేసిన కొంతమంది నేతలు ప్రగతి భవన్‌తో పాటు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కీలకమైన స్థానాల్లో కేటీఆర్ వర్గీయులు
దీనికితోడుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నామినేటెడ్ జాబితాను సిద్ధం చేస్తున్నట్లు పార్టీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కీలకమైన స్థానాల్లో కేటీఆర్ వర్గీయులే ఉండాలనే కోణంలో ఇప్పుడు పోస్టుల భర్తీ ఉంటుందంటున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీలో ఎలాంటి పదవులు లేకున్నా గులాబీ జెండా మోస్తున్న నేతలు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గురి పెట్టిందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అసంతృప్తులకు బీజేపీ గాలం వేయకుండా, పార్టీని బలహీన పర్చుకోకుండా ఉండేందుకు నామినేటెడ్ అయినా, పార్టీ పదవులను అయినా ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాల పర్యటన చేస్తున్న మంత్రి కేటీఆర్కు చాలా మంది నేతలు ఇదే అంశంపై కలిసి విజ్ఞప్తి చేసుకుంటున్నట్లు పార్టీలో టాక్.