ఆ సత్తా భారత్‌కు ఉంది : జిందాల్!

by Harish |
ఆ సత్తా భారత్‌కు ఉంది : జిందాల్!
X

దిశ, వెబ్‌డెస్క్: అడ్డంకులను తొలగించడంతో పాటు దేశీయ పరిశ్రమలో పోటీ తత్వాన్ని పెంచడం వల్ల భారత్‌ను ‘ప్రపంచ కర్మాగారం’గా మార్చేందుకు వీలవుతుందని జేఎస్‌డబ్ల్యూ ఛైర్మన్, ఎండీ సజ్జన్ జిందాల్ అభిప్రాయపడ్డారు. అసోచాం నిర్వహిస్తున్న సదస్సులో ఆయన మాట్లాడుతూ..భారత పరిశ్రమ మరింత పోటీగా మారగలదని, ఇది ప్రపంచ మార్కెట్‌కు ఉత్పత్తి చేయగలదని అన్నారు. భారత్‌ను ప్రపంచ కర్మాగారంగా మార్చవచ్చని వెల్లడించారు. ఉత్పత్తులను ఎగుమతి చేసే సమయంలో పరిశ్రమలు అనేక పన్నులను చెల్లిస్తున్నాయి. కానీ ఆ పన్నుకు రీఫండ్ లభించడంలేదన్నారు. ఎగుమతుల ఉత్పత్తులపై పన్నుల ఉపశమనం వంటి పథకాలను అమలు చేయాలని, ఇలాంటిది పెట్రో ఉత్పత్తులపై ఉందని ఆయన ప్రస్తావించారు.

ఈ ఏడాది మార్చిలో ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఎగుమతి ఉత్పత్తిపై పన్నుల తొలగింపు పథకానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఎగుమతులపై పన్నుల ఉపశమనం పథకాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కేంద్రం అమలు చేయనుంది. దీని వల్ల పరిశ్రమలో పోటీ మరింత పెరిగి, ప్రపంచానికి సరుకులను ఉత్త్పత్తి చేయగలదని, అదేవిధంగా శ్రమశక్తి విషయంలో భారత్ అవసరమైన స్థితిలోనే ఉందని సజ్జన్ జిందాల్ వివరించారు. భారత్ వద్ద నైపుణ్యం కలిగిన శ్రమ శక్తి ఉంది. చిన్న చిన్న సమస్యలను తొలగిస్తే దేశంలో సమర్థ వంతమైన పారీశ్రామికీకరణను తీసుకురాగలమని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed