- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ ఎత్తివేత వెనుక సర్కార్ వ్యూహం ఇదేనా?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపైన రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆర్థిక వనరులను సమకూర్చుకోడానికి, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ప్రచారాన్ని ఉధృతం చేయడం కోసమే మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు థర్డ్ వేవ్ అనివార్యమంటూ ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ హెచ్చరించారని, పొరుగున ఉన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి నెల రోజుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ఉపద్రవం సృష్టించబోతున్నదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ తన స్వార్థ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల జీవనం దెబ్బతింటున్నదనే అంశాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నదని విపక్షాల నేతలు మండిపడ్డారు.
లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోతుండడంతో మంత్రివర్గం పేరుతో ముఖ్యమంత్రి పూర్తి అన్‌లాక్ నిర్ణయాన్ని తీసుకున్నారని, దీనికి తోడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా పార్టీకి ప్రధాన అంశంగా మారిందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ కారణంగా సామాన్య ప్రజల కదలికలకు, చిరు వ్యాపారులకు, ఫుట్‌పాత్ వెండార్లకు వ్యాపారం తగ్గిపోయిన మాట నిజమే అయినా ఇప్పుడున్నట్లుగానో లేక మరో రెండు మూడు గంటలు ఎక్కువ సడలింపు ఇవ్వడమో సమంజసంగా ఉంటుందని, కానీ పూర్తిగా లాక్‌డౌన్ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయడం ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో సహేతుకమైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. ఢిల్లీ మొదలు తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లోనూ పరిమిత ఆంక్షలు ఉన్నాయని, ఎలాంటి ఆంక్షలు లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఉదహరించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే పార్టీ ప్రచారాన్ని మొదలు పెట్టిన టీఆర్ఎస్ ఇక విస్తృత ప్రచారం చేసుకోడానికి పూర్తి అన్‌లాక్ నిర్ణయాన్ని తీసుకున్నదని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా అనేక ఆంక్షలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి ప్రచారం చేసి ఆ నియోజకవర్గంలోని గ్రామాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడానికి కారణమైన టీఆర్ఎస్ ఇప్పుడు హుజూరాబాద్‌లోనూ అలాంటి పరిస్థితి తలెత్తడానికి కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సెప్టెంబరు చివరికల్లా ఉప ఎన్నిక రావచ్చన్న భావనతో రెండున్నర నెలల పాటు విస్తృత ప్రచారం కోసం మంత్రివర్గం ద్వారా ఈ నిర్ణయం వచ్చేలా కేసీఆర్ చూసుకున్నారని ఆరోపించారు.
థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటూ వైద్యారోగ్య శాఖ అంచనా వేసిందని, అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మొదలు ప్రధాన ఆస్పత్రుల వరకు ఆక్సిజన్, మందులు, సిబ్బంది లాంటివాటిని సిద్ధం చేయడం మొదలుపెట్టిందని, ఇదే సమయంలో కనీస ఆంక్షలు కూడా లేకుండా మొత్తానికే చేతులెత్తేయడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శమని వ్యాఖ్యానించారు. థర్డ్ వేవ్ ముప్పు తప్పదని తెలిసినా ఇప్పుడు ప్రభుత్వం దానిపైన పెద్దగా ఫోకస్ పెట్టకుండా అన్‌లాక్ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజలకు జాగ్రత్తలు చెప్పే బాధ్యత నుంచి తప్పుకున్నదని అభిప్రాయపడ్డారు. పీఆర్సీ జీవోల ద్వారా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోడానికి అన్‌లాక్ దిశగా నిర్ణయం తీసుకున్నదని గుర్తుచేశారు.
ఒకవైపు రానున్న పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పెళ్ళి ముహూర్తాలు ఉండడం, మరోవైపు జూలై 1 నుంచి విద్యా సంస్థలను తెరవాలని భావించడంతో పెద్దలకు, పిల్లలకు వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరిగే ప్రమాదం ఉన్నదని, దీని నివారణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రజల భద్రతను గాలికి వదిలేయడమేనని వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులే కరోనా నిబంధనలను పాటించకపోతే సామాన్యులకు ఎలా మెసేజ్ ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లాంటి వారు మాస్కుల జాగ్రత్తలే పాటించకపోతే వారు ప్రజల చేత ఎలా అమలు చేయిస్తారని ఉదహరించారు.