- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాఠాలు లేకుండానే పరీక్షల షెడ్యూల్
దిశ, తెలంగాణ బ్యూరో: అకడమిక్ ఇయర్ పూర్తిగా అయిపోయిన తర్వాత నేరుగా పరీక్షలు నిర్వహించడంతో ఏమీ రాయాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. ఎంబీఏకు నెల రోజుల వ్యవధిలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. మరో నెల ముందు నుంచే ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించడంతో ఇక్కడ క్లాసులకు హాజరు కావాలా, పరీక్షలకు సిద్ధమవ్వాలా అని విద్యార్థులు వాపోతున్నారు. ఓయూ దూరవిద్యా కేంద్రం అధికారుల నిర్వాకానికి విద్యార్థులు బలవుతున్నారు. ఉద్యోగాలకు ఆటంకం లేకుండా, ఆర్థికంగా ఇబ్బందులు కాకుండా యూజీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుకునేందుకు ఓయూ దూరవిద్యా కేంద్రం అవకాశం కల్పిసుండడంతో ఎక్కువ మంది అటుగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అధికారులు ఇష్టారీతిగా క్లాసులు నిర్వహించడం, పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్నో ఆశలతో యూనివర్సిటీని ఆశ్రయిస్తున్న విద్యార్థులకు అధికారుల వ్యవహారశైలి శాపంగా మారుతోంది.
పాఠాలు చెప్పకుండానే పరీక్షలు..
ఓయూ దూరవిద్యా కేంద్రం పరిధిలో ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (పీజీడీసీఏ, పీజీడీఎం (మ్యాథ్స్), పీజీడీబీఎం బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2019లో ప్రారంభమైన అకడమిక్ ఇయర్‌కు సంబంధించి విద్యార్థుల కాంటాక్ట్ కం కౌన్సెలింగ్ కు కేటాయించినా 15 రోజులు కూడా అధికారులకు ఇప్పటి వరకు దొరకలేదు. ఏడాదిన్నర గడిచినా ఈ పక్షం రోజుల తరగతులు విద్యార్థులకు అందలేదు. ఈ క్రమంలోనే నేరుగా పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేయడంతో విద్యార్థులు రాయక తప్పడం లేదు. ఈ విషయంపై ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేష్ స్పందిస్తూ ఫిబ్రవరి నెల మధ్య వరకూ అడ్మిషన్లు ఉంటాయని, లాక్‌డౌన్ కారణంగా పాఠాలు బోధించడం సాధ్యం కాలేదన్నారు.
అటు పరీక్షలు .. ఇటు తరగతులు..
ఇక ఎంబీఏ విద్యార్థులది మరో సమస్య. డిసెంబర్ 1 నుంచి ఎంబీఏ ఫస్టియర్, థర్డ్ సెమిస్టర్ పరీక్షలకు, జనవరి 5 నుంచి సెకండియర్, ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేశారు. కాగా, ఈనెల 7వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్టు విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు క్లాసులకు హాజరు కావాలా, పరీక్షలకు చదువుకోవాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. సెకండియర్ విద్యార్థులకు ఈ నెల 7న తరగతులు ప్రారంభమవగా డిసెంబర్ 1 నుంచి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ చేయడం గమనార్హం. నెల రోజుల్లోనే బోధించే పాఠాలెన్ని, పరీక్షల్లో ఎంత రాయగలుగుతామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల సమస్యలతో సంబంధం లేకుండా, యూనివర్సిటీ అధికారులు ఇష్టానుసారం వ్యవహరించడం మానుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.
అధికారులు పద్ధతి మార్చుకోవాలి..
ఓయూ అధికారులు ఇష్టారీతిలో వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు నష్టపోతున్నారు. నెల రోజులుగా కూడా పాఠాలు పూర్తికాకముందే పరీక్షలు నిర్వహిస్తే ఏం రాయగలుగుతారు. ఫలానా కోర్సు, ఇయర్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ అధికారులు ఇలానే వ్యవహరిస్తున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఓయూ సీడీఈ డైరెక్టర్ ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థులు నష్టపోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. పరిస్థితిలో మార్పు రాకుంటే విద్యార్థుల పక్షాన ప్రత్యక్ష పోరాటాలకు దిగుతాం.
-మర్రి శ్రీమాన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు