హైదరాబాద్ మెట్రో గైడ్‌లైన్స్‌ విడుదల

by  |
హైదరాబాద్ మెట్రో గైడ్‌లైన్స్‌ విడుదల
X

దిశ, న్యూస్‌బ్యూరో: అన్‌లాక్ 4.0లో భాగంగా మెట్రో రైళ్లు నడిపేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈనెల 7నుంచి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మూడు దశల్లో కారిడార్ ప్రకారంగా రైళ్ళను నడపాలని సంస్థ నిర్ణయించింది.

మొదటి దశలో సెప్టెంబర్ 7న కారిడార్-1 మియాపూర్- ఎల్‌బీనగర్ మార్గంలో ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నడపనున్నట్టు సంస్థ ప్రకటించింది. రెండోదశలో భాగంగా సెప్టెంబర్ 8న కారిడార్-3 నాగోల్ నుంచి రాయ్‌దుర్గం వరకు ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నడపనున్నట్టు వెల్లడించింది. మూడో దశలో భాగంగా సెప్టెంబర్ 9నుంచి అన్ని కారిడార్లలో ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రైళ్ళను నడపనున్నట్టు సంస్థ వివరించింది. సాధారణంగా ప్రతి 5నిమిషాలకు ఒక రైలును, ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకుని సమయాల్లో మార్పులు ఉంటాయని తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లను పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ, మూసాపేట్, భరత్‌నగర్‌లలోని స్టేషన్లను మూసివేస్తున్నట్టు పేర్కొన్నది.



Next Story