ఫలించిన రేవంత్ వ్యూహం.. అలక వీడిన ఏలేటి

by Aamani |   ( Updated:2021-08-06 05:13:15.0  )
Revanth Reddy, Maheshwar Reddy
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఎట్టకేలకు ఏలేటి అలక వీడారు.. టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య సయోధ్య కుదిరింది.. ఇద్దరి మధ్య విబేధాలకు ఇంద్రవెల్లి దళిత దండోరా కార్యక్రమం కారణమవ్వగా.. తాజాగా సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్ మధ్యవర్తిత్వంతో చివరికి ఒక్కటయ్యారు. ‘ఇంద్రవెల్లి దళిత దండోరా’ కార్యక్రమం రాష్ట్ర కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా ప్రకటించటం.. అదీ తూర్పు ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్ రావు బాధ్యతలు అప్పగించటం వివాదానికి, విబేధాలకు దారి తీసింది. తాజాగా కొక్కిరాలను తప్పించి.. స్థానిక డీసీసీకే సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించటంతో సమస్య సద్దుమణిగింది..!

ఈ నెల 9న పోరుగడ్డ ఇంద్రవెల్లి వేదికగా దళిత దండోరా నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. లక్షమంది దళితులు, గిరిజనులతో దండోరా నిర్వహిస్తామని.. కొమురంభీం స్ఫూర్తితో పోరాటాల్లో ముందుకు వెళ్తామని ఇటీవల చిరాన్ ఫోర్టులో జరిగిన మంచిర్యాల జిల్లా కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. అదీ మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేంసాగర్ రావు నాయకత్వంలో నిర్వహిస్తామని తెలిపారు. దళిత దండోరా నిర్వహిస్తామనే వరకు బాగానే ఉన్నా.. ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే విషయంలో రాష్ట్ర కమిటీలో నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర కమిటీలోని బాధ్యులు, సీనియర్లతో పాటు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మను ఏలేటి మహేశ్వర్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి మధ్య విబేధాలకు కారణమైంది. అదీకాక తన పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్ జిల్లా, పశ్చిమ ప్రాంతం (ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి)లో నిర్వహించే దండోరాను తమతో చర్చించకుండా.. తమ పరిధిలో తూర్పు ప్రాంతానికి చెందిన కొక్కిరాలకు బాధ్యతలు అప్పగించటంపై ఏలేటి అలక బూనారు.

అసంతృప్తితో ఉన్న కొక్కిరాలకు ఇంద్రవెల్లి సభ నాయకత్వం అప్పగించి అనుకూలంగా మలుచుకోవాలని భావించగా.. ఏలేటితో కొత్త పంచాయతీ మొదలై దూరం పెరిగింది. కొక్కిరాలకు, ఏలేటికి మొదటి నుంచి విభేదాలున్నాయి. రాజకీయంగా వర్గ పోరు నడుస్తుండగా.. పాత పగలకు ఇంద్రవెల్లి దండోరాతో కొత్త సెగలు తాకాయి. తనను సంప్రదించకుండా తన పరిధిలో ఏ మాత్రం సంబంధం లేని తూర్పు ప్రాంత నాయకుడికి బాధ్యతలు ఎలా ఇస్తారనే అసంతృప్తికి లోనయ్యారు. మంచిర్యాల జిల్లా కార్యకర్తల సమావేశంలో ఇంద్రవెల్లి దళిత దండోరా ప్రకటన చేసిన మరుసటి రోజే ఏలేటి శ్రీలంక వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఎన్నికల సన్నద్ధ సమావేశానికి దూరంగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో దూరం పెరిగింది. ఇటు ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను సీతక్కతో కలిసి కొక్కిరాల పరిశీలించగా.. బోథ్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పశ్చిమ ప్రాంతంలోని ఇతర నాయకులంతా కొక్కిరాల నాయకత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉండటం, ఏలేటి విదేశాలకు వెళ్లటంతో పరిస్థితి తీవ్రతను గ్రహించిన రేవంత్ రెడ్డి వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టారు.

ఏలేటిని ఒప్పించే బాధ్యతలను పార్టీ సీనియర్లు కుందూరు జానారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్‌లకు అప్పగించారు. గురువారం రోజున ఏలేటి హైదరాబాదుకు తిరిగి రాగా.. వెంటనే రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం వహించారు. ఏలేటితో మాట్లాడిన సీనియర్లు.. సమస్యను ఓ కొలిక్కి తెచ్చారు. ఇంద్రవెల్లి దళిత దండోరా నిర్వహణ బాధ్యతలను స్థానిక డీసీసీకి అప్పగించాలనే ఏలేటి డిమాండుకు అంగీకరించారు. కొక్కిరాల నాయకత్వం కాకుండా.. సభ, స్టేజీ నిర్వహణ బాధ్యతలు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్‌కు అప్పగించటంతో వివాదం సద్దుమణిగింది. దీంతో అటు రేవంత్ రెడ్డితో ఏలేటికి విబేధాలు దూరంకాగా.. కొక్కిరాలతో మాత్రం సయోధ్య ఇప్పట్లో కుదిరేలా లేదు. గతంలో మాదిరిగానే జిల్లాలో రెండు గ్రూపులు కొనసాగేలా ఉన్నాయి. మరోసారి ఏలేటి తన పట్టు నిలుపుకోగా.. కొక్కిరాలకు మళ్లీ అసంతృప్తి మిగిలింది. ప్రతి నియోజకవర్గం నుంచి జన సమీకరణకు ఇంచార్జిలను వేయగా.. ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు పర్యవేక్షించనున్నారు. సమీప నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది, దూరం ఉన్న నియోజకవర్గాల నుంచి తక్కువ మందిని సమీకరణ చేయనున్నారు.

గ్రానైట్ వ్యవహారంలో ‘బండి’ పాత్ర ఉందా.. సంజయ్‌ అల్లుడి మెసేజ్ వైరల్

Advertisement

Next Story