కొత్త విద్యుత్ చట్టం కథేంటి?

by Shyam |
కొత్త విద్యుత్ చట్టం కథేంటి?
X

• రాష్ట్రాల హక్కులకు విఘాతమేనా?
• కేసీఆర్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ

దిశ, న్యూస్ బ్యూరో :
కొత్త విద్యుత్ చట్టం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందా? ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తోందా? దేశవ్యాప్తంగా మొత్తం విద్యుత్ రంగాన్ని కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోనుందా? ఈ సందేహాలన్నింటి నడుమ కేంద్రం సరిగ్గా అదే ప్రయత్నంలో ఉందనే అభిప్రాయమే కలుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కేంద్రం పెత్తనం చేయడమేంటని ఆగ్రహంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాన్ని ఆమోదించే పరిస్థితి లేదని, పార్లమెంటులో చర్చ సందర్భంగా దీన్ని వ్యతిరేకిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)ల సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుందా అని కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని రాష్ట్రాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కష్టకాలంలో పార్లమెంటు సమావేశాలు ఇప్పట్లో లేని సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టానికి తెర తీయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

ఇంతకూ ఈ చట్టంలో ఏముంది ? ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఇదే చర్చ జరుగుతున్నది. విద్యుత్ రంగానికి సంబంధించి మూల చట్టానికి పలు సవరణలు ప్రతిపాదిస్తూ ఇటీవలే బహిరంగ చర్చకు పెట్టి కొన్ని కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. నిజానికి ప్రతిపాదిత సవరణ చట్టంలో రాష్ట్రాల ఈఆర్సీల సభ్యులు నియమించడంపై కేంద్రం ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదని పలువురు విద్యుత్ నిపుణులు అంటున్నారు. కేవలం కేంద్ర, రాష్ట్ర ఈఆర్సీలు, అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఆప్‌టెల్)‌ల సభ్యుల నియామకానికి వేర్వేరు సెలక్షన్ కమిటీలు కాకుండా ఏకీకృత సెలక్షన్ కమిటీ ఉండేలా కేంద్రం ఈ కొత్త చట్టంలో సెక్షన్‌లను ప్రతిపాదించిందని, రాష్ట్రాల కమిషన్‌ను రాష్ట్రాలు, కేంద్ర కమిషన్‌ను కేంద్రమే నియమించుకుంటుందని, ఈ మేరకు సంబంధిత సెక్షన్‌లో స్పష్టంగా పేర్కొన్నారని నిపుణులు ఉదహరించారు.

ఇక కేసీఆర్ విలేకరుల సమావేశంలో చెప్పిన మరో ముఖ్యమైన అంశం.. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలకు సంబంధించిన సవరణ. నిజానికి ఒక్క వ్యవసాయమే కాదు, అన్ని రకాల విద్యుత్ సబ్సిడీలపై కొత్త చట్టంలో కొంత కఠినంగానే ఉండబోతున్నామన్నట్టుగా కేంద్రం సంకేతాలిచ్చింది. ఏ రకమైన సబ్సిడీ అయినా నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రంగాలకు చెందిన కస్టమర్లకు నగదు బదిలీ పద్ధతి ద్వారా మాత్రమే అందజేయాలని కేంద్రం చట్టంలో ప్రతిపాదించింది. అంతేగాక ఈఆర్సీలు విద్యుత్ టారిఫ్ నిర్ణయించేటపుడు సబ్సిడీలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎన్ని కనెక్షన్లున్నాయి, రిటైల్‌గా విద్యుత్ విక్రయిస్తే ఎంత ఆదాయం వస్తుందనేదాని ప్రకారమే చార్జీలు నిర్ణయించాలని కొత్త చట్టం పేర్కొంటోంది. ఈఆర్సీలు విద్యుత్ టారిఫ్‌ల‌ను ఫైనల్ చేసేటపుడు విద్యుత్ పంపిణీ సంస్థలు( డిస్కంల) విద్యుత్ కొనడానికి, సరఫరాకు చేసే ఖర్చును పరిగణలోకి తీసుకుంటున్నాయి కానీ అందుకనుగుణంగా చార్జీలను పెంచడాన్ని మాత్రం వాయిదా వేస్తున్నాయని చట్టంలో కేంద్రం అభిప్రాయపడింది. ఇలా వాయిదా వేయడం వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటోందని పేర్కొంటూ చార్జీల నిర్ణయాన్నివాయిదా వేసే అంశంలో కమిషన్ అధికారాలను పరిమితం చేయనున్నట్టు చట్టంలో నిబంధనలు చేర్చింది.

అయితే సబ్సిడీలు, చార్జీలు నిర్ణయించేందుకు సంబంధించిన ఈ నిబంధనలు ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్‌కే కాదు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకు చెందిన సీఎంలెవ్వరికీ నచ్చవని ఆ నిపుణులు అభిప్రాయపడ్డారు. పవర్ సబ్సిడీల్లో సింహ భాగం వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలే ఉంటాయని వీటిని పరిగణలోకి తీసుకోకుండా వాణిజ్యపరంగా అన్ని కనెక్షన్లకు టారిఫ్‌లు నిర్ణయిస్తే ముందు రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాల్సి వస్తుందని వారంటున్నారు. ఈ పనిచేస్తే ఎక్కువ మంది ఓటర్లు కలిగిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ కారణం వల్లే రాష్ట్రాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్సులున్నట్లు వారు అభిప్రాయపడ్డారు.

ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వివాదాస్పదమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)ల ఏకపక్ష రద్దు లాంటి చర్యలను కూడా ఈ చట్టం అడ్డుకోనుందని, కాంట్రాక్టులను తప్పనిసరిగా అమలు చేసేందుకు ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్సింగ్ అనే అథారిటీని కొత్తగా ఏర్పాటు చేయనున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అథారిటీ ఇచ్చే తీర్పు సివిల్ కోర్టు ఇచ్చే డిక్రీతో సమానమని కేంద్రం చట్టంలో పేర్కొనడాన్ని ఇందుకు ఆధారంగా వారు చూపిస్తున్నారు. ఈ అధికారం ఇంతకముందు రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌ల(ఈఆర్సీలు)కు ఉండేదని, వాటికి బాధ్యతలెక్కువ కావడం వల్ల కాంట్రాక్టుల అమలు కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం చెబితే రాష్ట్రాలు ఒప్పుకోవని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థలో రాజ్యాంగం తమకు ఇచ్చిన అధికారాలను లాక్కోవడం కిందే రాష్ట్రాలు చూపించే ప్రయత్నం చేస్తాయని అంచనా వేస్తున్నారు.

గతంలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమ్మె చేసినపుడు ”సంస్థకు ఇప్పటికే చాలా చేశాం. ఇక నుంచి ఆర్టీసీ తన కాళ్ల మీద తానే నిలదొక్కుకోవాలి” అని వ్యాఖ్యానించినవారు చాలా మందే ఉన్నారు. దాదాపు సంస్థను మూసేసినంత పని చేశారు. సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు ఆర్టీసీ విషయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ కరెంటు సంస్థలను సంస్కరించడానికి కేంద్రం కొత్త చట్టం తీసుకొస్తుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని విమర్శిస్తున్నాయి. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఆర్థికంగా బలోపేతంగా ఉంటేనే దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగి ఆ రంగంలోకి పెట్టుబడులొచ్చి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అంటున్నారు. ఇది ఇష్టం లేని కేసీఆర్ రాజకీయం కోసం కరెంటు సంస్థలను, సబ్సిడీలను వాడుకునే నెపంతో రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం లాంటి మాటలతో మాయ చేయాలని ప్రయత్నిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

Tags: telangana, kcr, centre, new power amendment bill, draft, power reforms

Advertisement

Next Story