కీలక వడ్డీరేట్లు యథాతథం :ఆర్‌బీఐ

by Anukaran |   ( Updated:2021-02-05 03:18:11.0  )
కీలక వడ్డీరేట్లు యథాతథం :ఆర్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమీక్ష శుక్రవారం ముగిసింది. ఈ సమావేశం అనంతరం ఆర్‌బీఐ కీలక నిర్ణయాలను వెల్లడించింది. ఈ సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్టు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అలాగే ఆర్థిక వృద్ధిరేటు అంచనాలను మించి ఉందని శక్తికాంత దాస్ పేర్కొన్నారు. రెపోరేటు, రివర్స్ రెపోరేటులో వరుసగా నాలుగోసారి ఎటువంటి మార్పులను చేయలేదు. రెపోరేటును 4 శాతం, రివర్స్ రెపో రేటును 3.35 శాతాన్ని కొనసాగించనున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటును 10.5 శాతంగా ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేసింది. అదేవిధంగా ద్రవ్యోల్బణం అంచనాను 5.8 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గించారు.

జూన్ నాటికి ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెంట్ స్కీమ్’..

త్వరలో రిటైల్ పెట్టుబడిదారులకు నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్లోకి అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే, ఈ ఏడాది జూన్ నాటికి వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మెంట్ స్కీమ్’ను అందుబాటులో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించింది. చెక్కు క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి ఉద్దేశించిన చెక్ ట్రంకేషన్ సిస్టమ్(సీటీఎస్)ను ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అన్ని బ్యాంకు శాఖల కిందకు తీసుకురానున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రధాన కార్యాలయాల్లోనే ఉందని, సెప్టెంబర్ నుంచి అన్ని శాఖాల్లోనూ వర్తింపజేయనున్నారు.

Advertisement

Next Story