ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆర్‌బీఐ చర్యలు!

by Shyam |   ( Updated:2020-04-17 01:56:46.0  )
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆర్‌బీఐ చర్యలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. అవసరమైనపుడు తగిన చర్యలు తీసుకుంటామని, కొవిడ్-19 మహమ్మారి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎంతమేరకు ఉందనేది సమీక్షిస్తున్నామని, బ్యాంకుల పనితీరు బాగుందని దాస్ పేర్కొన్నారు. మహమ్మారి వ్యాప్తిస్తున్న విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు కావాల్సిన కీలక ప్రకటనలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం రివర్స్ రెపో రేటును 4 శాతం నుంచి 3.75 శాతానికి 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రెపో రేట్లతో సహా ఇతర కీలకమైన రేట్లను మార్చలేదు. ఏప్రిల్ 15 నాటికి రూ. 6.91 కోట్ల సర్‌ప్లస్ ఉందని, దీన్ని ఉపయోగించుకునేందుకు బ్యాంకులకు రివర్స్ రెపో రేటును లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం కింద 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రివర్స్ రెపో ఆపరేషన్ కింద ఆర్‌బీఐ సెక్యూరిటీ ఇవ్వడం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటుంది. ఈ సందర్భంలో ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటును రివర్స్ రెపో రేట్ అంటారు.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను ప్రకటించారు. రెవర్స్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో పాటు, బ్యాంకింగ్ రహిత ఆర్థిక సంస్థలకు సహాయం చేసేందుకు లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కింద రూ. 50,000 కోట్లు ప్రకటించింది. అంతేకాకుండా నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీ వంటి సంస్థలకు రూ. 50 వేల కోట్ల రీఫైనాన్స్ సదుపాయాన్ని కూడా కల్పిస్తామని ఆర్‌బీఐ వెల్లడించింది. బ్యాంక్ తాత్కాలిక వర్గీకరణ నిబంధనలను సడలించింది.

బ్యాంకుల వద్ద కావాల్సినంత ద్రవ్య లభ్యత:

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో ప్రజలు ఏటీఎమ్‌లను ఎక్కువగా వినియోగించారని దాస్ పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని, దానికి అవసరమైన జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ కొనసాగినన్నాళ్లు బ్యాంక్ కార్యకలాపాలకు ఆటంకాలుండవన్నారు. మొబైల్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయని చెప్పారు. మార్చిలో ఉత్పత్తి, అమ్మకాలు క్షీణించాయని, విద్యుత్ వినియోగం కూడా చాలా వరకూ తగ్గిపోయిందని దాస్ తెలిపారు. ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల వల్లే బ్యాంకుల వద్ద ద్రవ్య లభ్యత మెరుగా ఉందని వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.4 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని శక్తికాంతదాస్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ వల్ల ఏర్పడుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని దాస్ తెలిపారు. ప్రపంచ మార్కెట్లు, చమురు ధరలు ఒడిదుడుకుల్లో ఉన్నాయని దాస్ పేర్కొన్నారు. మిగిలిన దేశాల కంటే ఇండియా వృద్ధిరేటు సానుకూలంగా ఉందని, 2020 ఏడాదికి జీ20 దేశాల్లో ఇండియా 1.9 శాతంతో మిగిలిన దేశాలకంటే అధికంగా వృద్ధిరేటుని కలిగి ఉంటుందై గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు.

ఆర్‌బీఐ వెల్లడించిన కీలక ప్రకటనల్లో…

ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిల్వల అంశంలో ఢోకాలేదు. బ్యాంకుల వద్ద అవసరమైనన్ని ద్రవ్యనిల్వలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 90 శాతం ఏటీఎమ్‌లు పనిచేస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రూ. 50 వేల కోట్లు, నాబార్డుకు రూ. 25,000 కోట్లు, జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ. 10,000 కోట్లు ఇవ్వనున్నట్టు దాస్ స్పష్టం చేశారు. బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్ రేషియో 80 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయంతో బ్యాంకుల నిల్వలు పెరుగుతాయి. ఈ తగ్గింపు, ఈ ఏడాది అక్టోబర్ 1కి 90 శాతం, 2021, ఏప్రిల్ 1 నాటికి 100 శాతానికి పునరుద్ధరించబడుతుంది. మారటోరియం విధించిన సమయంలో నిరర్ధక ఆస్తులకు 90 రోజుల గడువు వర్తించదు.

Tags: Rbi Conference, Rbi Press Conference, Rbi Governor Shaktikanta Das, Repo Rate, Reverse Repo Rate, NBFC

Advertisement

Next Story