పెట్టుబడులు పెరగవు : ఎస్‌బీఐ చైర్మన్

by  |
పెట్టుబడులు పెరగవు : ఎస్‌బీఐ చైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ రేట్లలో కోత వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశాల్లేవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఛైర్మన్ రజనీష్ కుమార్ మంగళవారం తెలిపారు. ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) 47వ జాతీయ నిర్వహణ సదస్సులో మాట్లాడిన ఆయన, మూలధన వ్యయం సాధారణ స్థాయిలో ఉన్నందున ప్రస్తుత సంవత్సరం రుణ వృద్ధి మందగించిందని రజనీష్ వెల్లడించారు. 2008 నాటి సంక్షోభ సమయంలో బ్యాంకులు నిబంధనలను పలుచన చేయడం వల్ల రుణాలు భారీగా పెరిగాయని, దానివల్ల అధికంగా చెల్లించాల్సి వచ్చిందని, ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంకులు వివేకంతో వ్యవహరిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

ఆర్థిక వృద్ధి (Economic growth)ని పునరుద్ధరించడానికి మౌలిక సదుపాయాల వ్యయం ఒక మార్గమని ఎస్‌బీఐ ఛైర్మన్ సూచించారు. భారత్‌లో రూ. 10 ట్రిలియన్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పైప్‌లైన్ ఉందని, ఇది ఆర్థిక వ్యవస్థ (Economy)ను పుంజుకునేలా చేయగలదని తెలిపారు. ఎందుకంటే నిర్మాణ రంగం ఉద్యోగాలను, డిమాండ్‌ను సృష్టించగలదని నమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

ఇదే సదస్సులో పాల్గొన్న నీతి అయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగారియా మాట్లాడుతూ.. రుణాల పునర్వ్యవస్థీకరణ ఎన్‌పీఏలు, దివాలా ప్రక్రియను ఆలస్యం మాత్రమే చేస్తుందని, వాటిని తగ్గించదని అభిప్రాయపడ్డారు. జీడీపీ-రుణ నిష్పత్తి భారీగా పెరగకుండా ప్రభుత్వం ఆదాయాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, దీనికి ప్రభుత్వ ఆస్తులను మరింత ప్రైవేటీకరించడం, నగదు లభ్యతను పెంచుకోవడం అవసరమని ఆయన సూచించారు.



Next Story

Most Viewed