లక్ష కేజీల నీలి తిమింగలం

by  |
లక్ష కేజీల నీలి తిమింగలం
X

దిశ, వెబ్‌డెస్క్: విశ్వంలో అతిపెద్ద జంతువు ‘నీలి తిమింగలం’ అని చిన్నప్పటి నుంచి జనరల్ నాలెడ్జ్ పుస్తకాల్లో చదువుకుంటూనే ఉన్నాం. అయితే అతిపెద్ద అంటే దాదాపుగా దాని బరువు ఒక 6000 నుంచి 20000 కిలోలు ఉంటుందనుకుంటే పొరపాటేనని ఇటీవల సిడ్నీ సముద్ర తీరాల్లో కనిపించిన నీలి తిమింగలం నిరూపించింది. దీని బరువు అక్షరాల లక్ష కిలోలు ఉంటుందని మెరైన్ బయాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి జీవులు సిడ్నీ తీరం దరిదాపుల్లో కనిపించడం చాలా అరుదు. ఎంత అరుదంటే, వందేళ్లలో రెండు నుంచి మూడు సార్లు మాత్రమే ఇవి కనిపిస్తాయి. న్యూ సౌత్ వేల్స్ నేషనల్ పార్క్స్, వైల్డ్‌లైఫ్ సర్వీస్ ప్రకారం ఈ తిమింగలం పొడవు 82 అడుగులు ఉంటుందని ఒక అంచనా.

సిడ్నీకి చెందిన ఫొటోగ్రాఫర్ షీన్ కే ఈ నీలి తిమింగలం ఫొటోలను క్యాప్చర్ చేయగలిగాడు. మారూబ్రా తీరం గుండా అది వెళ్తుండగా షీన్ దాని ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఈ అరుదైన నీలి తిమింగలాన్ని అందరూ వీక్షించగల అదృష్టాన్ని కల్పించాడు. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ నివేదికల ప్రకారం అంతరించిపోతున్న దశలో ఉన్న ఈ నీలి తిమింగలాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాల్లో దాదాపు 10 వేల నుంచి 25 వేల వరకు మాత్రమే ఉండవచ్చునని అంచనా. వీటికి అంత పెద్ద శరీరం ఉన్నప్పటికీ వెంటనే కంటికి కనిపించకుండా మాయం అవగలవని, అందుకే చాలా అరుదుగా కనిపించే వీటి గురించి చాలా తక్కువ అధ్యయనాలు జరిగాయని ఎన్‌పీడబ్ల్యూఎస్ రేంజర్ ఆండ్రూ మార్షల్ తెలిపారు.



Next Story