రంగారెడ్డితో రాష్ట్రానికి రాబడి!

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రియల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా అక్రమ వెంచర్లు, లేఅవుట్లు నిర్మించారు. డిమాండ్ ​కనుగుణంగా విక్రయాలు జరిపారు. వినియోగదారులు సైతం ధరలు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ముందువెనుకా చూడకుండా కొనుగోలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎల్ఆర్ఎస్ జీవోతో సతమతమవుతున్నారు.

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన వెంచర్లు అధికంగానే ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారులు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో ఉన్నా సరే ఎల్ఆర్ఎస్ తీసుకోవాల్సిందే. ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయడం కుదరదు. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోనే నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు, వెంచర్లు వెలిశాయి. ఇవన్నీ క్రమబద్ధీకరణ జరిగితే రాష్ట్రానికి అత్యధిక ఆదాయం జిల్లా నుంచే సమకూరనుంది

రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీ పరిధిలో 26వేల ఎకరాల విస్తీర్ణంలో రియల్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు, లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2వేల వెంచర్లు 3లక్షల 30వేల ప్లాట్లు ఉన్నాయని అధికారులు వివరిస్తున్నారు. అలాగే, వికారాబాద్ జిల్లాలో 566 గ్రామ పంచాయతీలుండగా కేవలం 59 గ్రామాల్లో 221 అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. ఇందులో సుమారుగా పదివేల లోపు ప్లాట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఈ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసుకున్న వారందరూ క్రమబద్ధీకరించుకునేందుకు వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

ఈ ప్రాంతాల్లోనే అధికం…

రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, రాజేంద్రనగర్, అబ్దూల్లాపూర్​మెట్, ఆమనగల్లు, షాద్​నగర్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, అలాగే, వికారాబాద్ జిల్లాలో పెద్దెముల్, పరిగి, ధారూర్, తాండూరు, వికారాబాద్, యాల్ల మండలాల పరిధిలోనే అత్యధిక లేఅవుట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే అత్యధికంగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు అధికారులు వివరిస్తున్నారు.

ప్రభుత్వం కల్పించిన క్రమబద్ధీకరణ అవకాశాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాటు యజమానులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులు సూచిస్తున్నారు. 2020 ఆగస్టు 26 లోపు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు అనుమతి ఇచ్చారు. ప్లాట్ దరఖాస్తు చేసుకుంటే రూ.1000, లేఅవుట్​ దరఖాస్తు చేసుకుంటే రూ.10వేలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.

మందకొడిగా దరఖాస్తులు..

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మందకొడిగానే సాగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసేందుకు రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఇష్టానుసారంగా ప్రైవేట్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఫీజు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ. వెయ్యి ఉంటే రూ.2,500 వరకు వసూలు చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు లబ్ధిదారులు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒకట్ల సంఖ్యలోనే దరఖాస్తు చేసినట్లు సమాచారం. సమయం ఉందనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయాలా వద్దా అనే ఆలోచన చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 200 గజాల స్థలం ప్లాట్ల ఎల్ఆర్ఎస్ చేయాలంటే సుమారుగా రూ.లక్షకు పైగా ఖర్చు అవుతుంది. అదే గ్రామీణ ప్రాంతంలో భూమి విలువ తక్కువ ఉంటుంది.. కాబట్టి రూ.50వేల లోపు అయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వ భూ విలువ ప్రకారం ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement