రికార్డుల ‘రామయణం’

by Sujitha Rachapalli |
రికార్డుల ‘రామయణం’
X

దిశ వెబ్ డెస్క్ : ప్రస్తుతం టీవీ చానెల్స్ పెరిగిపోయాయి. సీరియల్స్ సంఖ్య. పెరిగింది. కానీ ఆనాటి ఆదరణ మాత్రం లేదనే చెప్పాలి. అప్పట్లో దూరదర్శన్ లో సీరియల్ వస్తుందంటే చాలు.. కుటుంబ సభ్యులతో పాటు, వీధిలోని వారంత తమ పనులు మానుకుని వచ్చి టీవీల ముందు వాలిపోయేవాళ్లు. ఆ తర్వాత వందల చానెళ్లలో .. కొన్ని వేల సీరియల్స్ , షోస్ వచ్చినా.. ఆనాడు పంచిన మధురానుభవాల్ని, మిగిల్చిన జ్ఞాపకాల్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. ఇప్పటికీ ఆ రోజుల్ని తలుచుకునేవాళ్లు ఎంతోమంది. మళ్లీ ఆనాటి రోజులను గుర్తు చేయడమే కాదు.. అలనాటి రికార్డులను కూడా తిరిగి రాస్తోంది డీడీ చానెల్. మళ్లీ ‘రామాయణం’ప్రసారం చేస్తున్న డీడీ.. అత్యధిక వీక్షణలతో.. నాటి పునర్వైభవాన్ని సొంతం చేసుకుంది.

వార్తలు, సీరియళ్లతో పాటు ఎన్నో వినోద కార్యక్రమాలను.. దూరదర్శన్ చానెల్ ప్రేక్షకులకు పరిచయం చేసింది కొన్ని సంవత్సరాల పాటు.. యావత్ భారతానికి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ అలరించింది. తర్వాత తర్వాత పలు చానెళ్ల రాకతో ఎందుకో వెనకబడిపోయింది. కానీ డీడీ అందించిన జ్ఞాపకాలు ఇప్పటికీ అందరిలో పదిలంగా ఉన్నాయి. ‘చిత్రలహరి’లో కరెంట్ పోతే టేక్ ఇట్ ఈజీ పాలసీ.. అంటూ ఓ పాటలో చెప్పినట్లు.. డీడీలో ప్రసారమయ్యే కార్యక్రమాలంటే.. జనాలు అంతగా ఇష్టపడేవారు. కరెంట్ పోతే .. చింతించే వారు. టీవీలకు ప్రేక్షకులను దగ్గర చేసిన ఘనత డీడీదే అయినా.. అందులో ‘రామాయణం’ ‘మహాభారతం’, ‘శక్తిమాన్’, ‘మాల్గుడి డేస్’,‘బునియాద్’ ‘హమ్ లోగ్’ ‘భారత్ ఏక్ కోజ్’, వంటి సీరియల్ పాత్ర ఎంతో ఉంది. ఈ క్లాసిక్స్ అన్ని కూడా విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఎన్నో రికార్డులతో పాటు, టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక వీక్షణలు పొందిన సీరియళ్లుగా పేరు దక్కించుకున్నాయి.

రామాయణ్ :

భారతీయ టీవీ ప్రేక్షకులకు రామాయణ ఇతిహాసాన్ని ఎంతో అద్భుతంగా చూపించింది ‘రామాయణ్’. వాల్మకీ రామాయణం, తులసీదాస్ ‘రామ్ చరిత్ మానస్’ ఆధారంగా ఈ సీరియల్ ను రామానంద్ సాగర్ రూపొందించారు. 1987, జనవరి 25న రామాయణం సీరియల్ దూరదర్శన్ చానల్ లో ప్రారంభమైంది. 78 ఎపిసోడ్లుగా వచ్చిన రామాయణ సీరియల్… 1988 జూలై 31 తో ముగిసింది. ఈ సీరియల్ ఎంత పెద్ద హిట్ అంటే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రేక్షకుల చూసిన ‘మైథాలాజికల్’ టీవీ సీరియల్ ఇదే. ముందుగా 52 ఎపిసోడ్స్ లలో ఈ సీరియల్ ను పూర్తి చేయాలని అనుకున్నా.. ప్రేక్షకుల ఆదరణ దృష్ట్యా 78 ఎపిసోడ్స్ లలో కంప్లీట్ చేశారు. మొదట రామాయణం, మహాభారత్ రెండు ఒకే సారి ప్రేక్షకుల అందించాలని భావించినా.. తొలిగా రామాయణం ప్రసారం చేశారు. ఇది పూర్తయ్యాక, మహాభారతం టెలీకాస్ట్ అయ్యింది. ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే రామాయణం కోసం, అందరూ ముందుగానే స్నానాలు చేసి, పూజలు చేసి టీవీల ముందు కూర్చునేవారు. సీరియల్ ప్రసారానికి ముందు టీవీలకు హారతి ఇచ్చేవారంటే అతిశయోక్తి కాదేమో.

ఆనాడు.. ఈనాడు :

రామాయణం సీరియల్ 55 దేశాల్లో ప్రసారమైంది. 650 మిలియన్ ప్రేక్షకులు ఈ ఇతిహాసాన్ని చూశారు. ప్రపంచంలో అత్యధిక మంది వీక్షించిన పౌరాణిక ధారవాహికగా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌’లో రామాయణ్ చోటు దక్కించుకుంది. ఈ సీరియల్‌కు 82 శాతం వ్యూయర్ షిప్ వచ్చింది. భారతీయ సీరియళ్ల చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ రికార్డ్. ఈ సీరియల్ వల్ల ప్రతి ఎపిసోడ్‌కు దూరదర్శన్‌కు రూ.40 లక్షల చొప్పున ఆదాయం సమకూరింది. ‘బునియాద్’, హమ్ లోగ్ సీరియళ్లకు కూడా అప్పుడప్పుడు 80 శాతం పైగా ప్రేక్షకాదరణ వచ్చింది. కానీ రామాయణం సీరియల్ మాత్రం మొదట్లో 50 శాతం రేటింగ్ ఉన్నా.. ఆ తర్వాతి రోజుల్లో 80శాతం రీచ్ అయ్యింది. కానీ ఆనాటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి ఎపిసోడ్ కు 80 శాతం రేటింగ్ తగ్గకుండా ఉండేది. అంతేకాదు.. హిందీకి అంతగా ఆదరణ లేని దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో కూడా 80శాత వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ సీరియల్ వచ్చే సమయంలో కరెంట్ పోతే.. స్థానిక ఎలక్ట్రిసిటీ కేంద్రాల్లో ప్రజలు గొడవలు చేసేవారు. అంతేకాదు బస్సులు, కార్లలో ప్రయాణిస్తున్నా.. సీరియల్ వచ్చే సమయం అవుతుందనగానే.. ఎక్కడికక్కడ వాహనాల్ని ఆపేసి.. దగ్గర్లో టీవీల్లో సీరియల్ చూసేవారంటే అతిశయోక్తి కాదు. సీరియల్ ప్రసారమయ్యే టైమింగ్ లలో.. ప్రభుత్వ మీటింగ్ లను కూడా వాయిదా వేసిన సందర్భాలున్నాయి.

తాజాగా లాక్‌డౌన్ కారణంగా డీడీ నేషనల్‌లో మార్చి 28 నుంచి మళ్లీ రామాయణం సీరియల్ ను ప్రసారం చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10, రాత్రి 9 నుంచి 10 గంటల సమయంలో ఇది ప్రసారం అవుతోంది. మార్చి 28న ఉదయం ప్రసారమైన రామాయణం సీరియల్ ను 3.40 కోట్ల మంది చూడగా, సాయంత్రం ఎపిసోడ్ ను 4.50 కోట్ల మంది చూశారు. మరుసటి రోజు ఉదయం 4 కోట్ల మంది, సాయంత్రం ఎపిసోడ్ ను 5.10 కోట్ల మంది చూడడం విశేషం. ఇది గత కొన్నేళ్లుగా ప్రసారవుతున్న సీరియల్స్ లో ఈ స్థాయి ఆదరణ రామాయణానికే దక్కడం గమనార్హం.

దూరదర్శన్ కు పెరిగిన ఆదరణ :

లాక్ డౌన్ లో ప్రజలకు వినోదం పంచేందుకు అత్యంత ప్రజాదరణ పొందిన రామాయణం సీరియల్ ను దూరదర్శన్ తిరిగి ప్రసారం చేస్తోంది. వీటితో పాటు మహాభారతం, శక్తిమాన్, బునియాద్ వంటి ప్రముఖ ధారావాహికలనూ మళ్లీ వేస్తోంది. దాంతో దూరదర్శన్ కార్యక్రమాలకు ప్రేక్షకాదరణ భారీగా పెరిగింది. గతవారంలో దేశంలోనే అత్యధిక మంది చూసిన ఛానల్ గా అవతరించింది. లాక్ డౌన్ రెండోవారంలో దూరదర్శన్ కు వీక్షకుల సంఖ్య 40 శాతం పెరిగిందని బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసర్చ్ కౌన్సిల్ (బార్క్) తెలిపింది. ప్రైవేట్ ఛానళ్లను మించి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పెరుగుదల నమోదైందని తెలిపింది. రామాయణ్, మహాభారత్ సీరియళ్లే దూరదర్శన్ ను టాప్ లో నిలబెట్టాయని బార్క్ పేర్కొంది.

టీవీలకు అతుక్కుపోతున్నారు :

టీవీ, ఫోన్ల వాడకం దేశంలో రికార్డు స్థాయిలో పెరిగిందని బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌(బార్క్) – నీల్సన్ వీక్లీ తాజా రిపోర్టు చెబుతోంది. దేశంలోని అన్ని భాషా చానల్స్ లో న్యూస్ చానళ్లలనే ఎక్కువ మంది చూస్తున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. ప్రతి రోజు 622 మిలియన్ల మంది టీవీ చూస్తుండగా రోజులో సగటున 4 గంటల 40 నిమిషాల పాటు టీవీ ముందు గడుపుతున్నట్లు ఈ రిపోర్ట్లో తేలింది.
– మోదీ ప్రసంగాన్ని 11.90 కోట్లమంది చూశారని.. దానికి మించి లాక్ డౌన్ పై మోదీ ప్రకటనను అత్యధికంగా 19.70 కోట్లమంది వీక్షించారని బార్క్ ప్రకటించింది.
-మొత్తంగా గతవారంతో పోలిస్తే 4 శాతం వీక్షకులు పెరిగారు. కరోనాకు ముందునుంచి చూస్తే ఇది 43 శాతం పెరిగింది.
-ప్రస్తుతం ఎలాంటి క్రీడలు లేకపోయినా.. స్పోర్ట్స్ ఛానళ్లకు 21 శాతం వీక్షకులు పెరిగారు. భారత్ గతంలో గెలిచిన క్రికెట్ మ్యాచ్ లు, డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచులను తిరిగి ప్రసారం చేస్తుండటమే ఇందుకు కారణం.

పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వాడకం

లాక్‌‌డౌన్‌ తో స్మార్ట్‌ఫోన్ల వాడకం మరింత పెరిగింది. గతంతో పోలిస్తే ఇది 12% అధికం. రోజుకు సగటున 3.8 గంటలు, వారానికి 26.4 గంటలు ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్లతో బిజీగా గడుపుతున్నారు. చాటింగ్ చేయడం 43%, సోషల్ మీడియాలో సమయం 42% పెరిగింది.

Tags: ramayanam, mahabharatham, tv, viewership, smartphone, barc,

Advertisement

Next Story