ప్రభుత్వాల తీరు వల్లే రైతు ఆత్మహత్యలు.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి

by Sridhar Babu |
damodar reddy
X

దిశ, కామేపల్లి: రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే‌నని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కామేపల్లి మండలం, నెమలిపురి తండాలో ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న గిరిజన రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.15 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. పేద రైతులకు అందాల్సిన ప్రభుత్వ సహాయంలో కోతలు విధిస్తున్నారని ఆరోపించారు.

గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా.. దళారీ వ్యవస్థను అడ్డుకోవడంలో విఫలమయ్యారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్ద పీట వేసి, వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల వల్ల రైతులు తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు రాంరెడ్డి గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, కామేపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి, జెడ్పీటీసీ బి. వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మాలపాటి సత్యనారాయణ, ఎంపీటీసీలు రామ్ రెడ్డి జగన్నాథ్ రెడ్డి, నల్లమోతు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story