ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు.. డీఎస్ సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-07-16 09:37:20.0  )
Dharmapuri Srinivas
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదని రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది లేనిది కేసీఆరే చెప్పాలని ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలు అని చాలామంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని.. చాలా మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్న ఇళ్లలో కూడా భర్త ఒకపార్టీ, భార్య మరోపార్టీలో ఉన్నారని కొట్టిపారేశారు. దేవుడు ఇచ్చిన కాడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు. తనకు జీపులు ఎక్కి, కార్లలో తిరిగి ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదన్నారు. తనకు సంజయ్, అర్వింద్‌లు రెండు కండ్లలాంటి వారని వెల్లడించారు.

తన కొడుకులిద్దరూ ఏది చేసినా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తారని నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. ఇద్దరు పిల్లలు స్వతంత్రంగా సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఎదిగారని పేర్కొన్నారు. తనకు సంబంధం లేని పార్టీలో అర్వింద్ చేరినా అభ్యంతరం తెలుపలేదన్నారు. కష్టపడ్డాడు ఎంపీగా గెలిచాడని తెలిపారు. మేయర్‌గా సంజయ్ కూడా ఐదేండ్లు రిమార్కు లేకుండా పనిచేశాడని డీఎస్ అన్నారు. తనతో పాటే టీఆర్ఎస్‌లోకి వచ్చినప్పటికీ పరిస్థితుల కారణంగా ఆయన భవిష్యత్తును ఆయనే చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.



Next Story

Most Viewed